రాహుల్ ఓ పెద్ద జోక్, రాజకీయ పరిపక్వత లేదు.. డీఎంకే విమర్శల దాడి
ABN , Publish Date - Jun 16 , 2026 | 03:25 PM
లోక్‌సభలో విపక్ష నేత, తమిళనాడులో తమ మాజీ భాగస్వామి రాహుల్ గాంధీపై డీఎంకే ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీ ఒక పెద్ద జోక్ అంటూ విమర్శించింది. విపక్షాల ఐక్యతను ఆయన దెబ్బతీశారని ఆరోపించింది.
చెన్నై: లోక్‌సభలో విపక్ష నేత, తమిళనాడులో తమ పార్టీ మాజీ భాగస్వామి రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై డీఎంకే (DMK) ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీ ఒక పెద్ద జోక్ అంటూ విమర్శించింది. విపక్షాల ఐక్యతను ఆయన దెబ్బతీశారని ఆరోపించింది. అటు ఇండియా కూటమిలో, ఇటు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రవర్తనను ప్రశ్నించింది.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల అనంతరం డీఎంకేతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ ఉద్వాసన చెప్పి విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)కు మద్దతు తెలపడంపై డీఎంకే ఐటీ విభాగం సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో విమర్శలు గుప్పించింది. 'రాజకీయ ఉనికి కోసం కాంగ్రెస్ పోరాడుతున్న సమయంలో మేము వారిని భుజంపై పెట్టుకుని మోసాం. కానీ కొత్త బొమ్మ రాగానే వారు మాకు హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు' అని రాసుకొచ్చింది. రాహుల్‌ను ఒక పెద్ద జోక్‌గా అభివర్ణించింది.
విరుచుకుపడిన మురసోలి..
డీఎంకే అధికారిక పత్రిక 'మురసోలి' సైతం తమ సంపాదకీయంలో రాహుల్‌పై విరుచుకుపడింది. ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, విపక్ష పార్టీల్లో చీలికలు తలెత్తడానికి ఆయనే కారకుడని ఆరోపించింది. విపక్షాల ఐక్యత గురించి ఉపన్యాసాలు ఇస్తూ పలు రాష్ట్రాల్లో విపక్షాల ఐక్యతను బలహీనపరుస్తున్నది ఎవరని రాహుల్‌ను నిలదీసింది. కేరళలో వామపక్షాలు సైతం రాహుల్‌పై ఇటీవల చేసిన విమర్శలను ప్రస్తావించింది. ఎన్నికల ప్రచారంలో పినరయి విజయన్‌ను అరెస్టు చేయాలని రాహుల్ డిమాండ్ చేయడం, బీజేపీతో ఎల్‌డీఎఫ్ రహస్య అవగాహన కుదుర్చుకుందని ఆరోపించడంపై కమ్యూనిస్టు నేతలు నిలదీయడాన్ని 'మురసోలి' పత్రిక తమ సంపాదకీయంలో గుర్తుచేసింది. ప్రత్యర్థి బీజేపీకి బదులుగా సొంత భాగస్వామ్య పార్టీలను విమర్శించడానికే రాహుల్ ఆసక్తి చూపారనే అభిప్రాయాలకు ఆయన చర్యలు తావిస్తున్నాయని పేర్కొంది. పలు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం కోసం ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా రాహుల్, కాంగ్రెస్ పదేపదే పనిచేస్తున్నట్టు ఆ సంపాదకీయం ఆరోపించింది. తమిళనాడులో కూటమి బ్యానర్‌పై పోటీ చేసి, సీట్లు గెలిచిన తర్వాత డీఎంకేను కాంగ్రెస్ వంచించిందని విమర్శించింది. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఆమోదంతోనే టీవీకే సారథ్యంలోని ప్రభుత్వానికి మద్దతివ్వాలని కాంగ్రెస్ శాసనసభ్యులు నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. రాహుల్ గాంధీ రాజకీయ అపరిపక్వత, నిలకడలేమి కారణంగానే ఇండియా కూటమిలో లుకలుకలు ఏర్పడ్డాయని తప్పుపట్టింది. కాగా, మురసోలి సంపాదకీయంపై కాంగ్రెస్ ఇంకా స్పందించలేదు. అయితే తమిళనాడులో ప్రజాతీర్పునకు అనుగుణంగానే కాంగ్రెస్ వ్యవహరించినట్టు ఆ పార్టీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి.
ఇవి కూడా చదవండి..
ఆధార్ కార్డు దుర్వినియోగంపై పిటిషన్.. కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు
కాఫ్ సిరప్ కొనాలంటే ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి