టెలిగ్రామ్‌పై నిషేధం నిరర్థకం.. సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ నిసర్గ అధికారి
ABN , Publish Date - Jun 16 , 2026 | 02:36 PM
నీట్ ముగిసేవరకూ టెలిగ్రామ్‌పై నిషేధం విధించడం నిరర్థకమని సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు నిసర్గ అధికారి ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: నీట్ పరీక్ష ముగిసేవరకూ టెలిగ్రామ్‌ను ఎవరూ వినియోగించకుండా కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సూచనల మేరకు పేపర్ లీక్ రిస్క్‌ను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ చర్యతో ప్రయోజనం ఉండదని సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు నిసర్గ అధికారి ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. సీబీఎస్‌ఈ ప్రశ్నపత్రాల మూల్యాంకనానికి ఉద్దేశించిన ఓఎస్‌ఎమ్ పోర్టల్‌లో భద్రతా లోపాలను గుర్తించిన నిసర్గ సంచలనానికి తెరతీసిన విషయం తెలిసిందే. నిసర్గ ప్రతిభను గుర్తిస్తూ ఐఐటీ కాన్పూర్ అతడికి సీఐ3హబ్‌లో పరిశోధకుడిగా ఛాన్స్ కూడా ఇచ్చింది.
టెలిగ్రామ్‌పై కేంద్రం తాత్కాలిక నిషేధం నేపథ్యంలో నిసర్గ ఎక్స్ వేదికగా స్పందించారు. పేపర్ లీక్‌లను అడ్డుకోలేని పరిస్థితి చివరకు టెలిగ్రామ్‌ను బ్యాన్ చేసే స్థితికి దారి తీసిందని వ్యాఖ్యానించారు. టెలిగ్రామ్‌పై నిషేధం అసాధ్యమని తేల్చి చెప్పారు. ప్రాక్సీలు, ఇతర సాధనాల ద్వారా ప్రభుత్వ నిషేధాలను అధిగమించే విధంగా టెలిగ్రామ్ నిర్మాణం జరిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో అసలు టెలిగ్రామ్ లాంటి మెసేజింగ్ యాప్‌లపై నిషేధం సాధ్యమేనా? అన్న చర్చ మొదలైంది.
టెలిగ్రామ్‌పైనే నిషేధం ఎందుకు?
టెలిగ్రామ్ అనే యాప్‌ను పావెల్ డ్యూరోవ్ రూపొందించారు. టెలిగ్రామ్ యూజర్లు తమ ఫోన్ నంబర్ సహా వ్యక్తిగత వివరాలేవీ బయటకు పొక్కకుండానే యాప్‌లో ఛానల్స్‌ను నిర్వహించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా దుర్వినియోగానికి ఆస్కారం ఏర్పడిందని అంటున్నారు. వాట్సాప్‌లో మాత్రం యూజర్లకు మరీ ఇంత స్వేచ్ఛ ఉండదని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఏఐ టూల్స్ సాయంతో వాట్సాప్ గ్రూపుల్లో అనుమానాస్పద అంశాలపై మెటా నిత్యం ఒక లుక్ వేసి ఉంటుందని అంటున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
కాఫ్ సిరప్ కొనాలంటే ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి
ఈ-20 పెట్రోల్ వాడితే.. వాహన బీమా తిరస్కరించే చాన్స్!