అన్నాడీఎంకేకు షాక్.. మాజీ మంత్రులతో సహా 300 మంది టీవీకేలో చేరిక
ABN , Publish Date - Jun 06 , 2026 | 08:32 PM
తమిళనాట సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన అన్నాడీఎంకేకు గట్టి దెబ్బతగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులతో సహా 300 మందికి పైగా సభ్యులు విజయ్ సారథ్యంలోని అధికార తమిళగ వెట్రి కళగంలో శనివారంనాడు లాంఛనంగా చేరారు.
చెన్నై: తమిళనాట సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన అన్నాడీఎంకే (AIADMK)కు గట్టి దెబ్బతగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులతో సహా 300 మందికి పైగా సభ్యులు విజయ్ సారథ్యంలోని అధికార తమిళగ వెట్రి కళగం ( TVK)లో శనివారంనాడు లాంఛనంగా చేరారు. పనైయుర్‌లోని టీవీకే ప్రధాన కార్యాలయంలో తమిళనాడు జనవనరుల శాఖ మంత్రి ఎన్.ఆనంద్, రెవెన్యూ మంత్రి సెంగోట్టియన్, ప్రజాపనుల శాఖ మంత్రి ఆధవ్ అర్జున సమక్షంలో వీరంతా ఆ పార్టీలో చేరారు. టీవీకేలో చేరిన నేతలు, కార్యకర్తలను టీవీకే ఎమ్మెల్యే పి.వెంకటరామన్ స్వాగతించారు. ఇదొక గౌరవప్రదమైన కార్యక్రమం, చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.

టీవీకేలో చేరిన ప్రముఖుల్లో..
టీవీకేలో చేరిన నేతల్లో మాజీ మంత్రి వెల్లమాండి నటరాజన్, అన్నా ట్రేడ్ యూనయన్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కమలాక్కన్నన్, అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే మైలాపూర్ నటరాజ్, మాజీ మంత్రి ఆనందన్, పరమకుడి అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే సాధన్ ప్రభాకర్, తిరుపత్తూర్ సిటీ కార్యదర్శి డీటీ కుమార్ మరో 300 మంది ఇతరులు ఉన్నారు.
అన్నాడీఎంకే నాయకత్వంలో ప్రజలకు సరైన సేవలు అందించలేకపోతున్నందునే తాము టీవీకే చేరాలని నిర్ణయించుకున్నట్టు ఆ పార్టీలో చేరిన పలువురు నేతలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత నాయకత్వంలో అన్నాడీఎంకే కార్యకర్తలంతా క్రమశిక్షణతో ఉండేవారని, ఆమె మరణం పార్టీకి తీరనిలోటుగా మిగిలిపోయిందని మాజీ మంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత ఉడుమలై రాధాకృష్ణన్ పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా పార్టీ వెన్నంటే ఉన్నప్పటికీ సమర్ధవంతంగా ప్రజాసేవ చేయలేకపోయామని, సంక్లిష్ట పరిస్థితుల్లో పనిచేయాల్సి వచ్చిందని అన్నారు. ఎంజీ రామచంద్రన్, జయలలిత సిద్ధాంతాలు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌లో తమకు కనిపించాయని, ఆ పార్టీ ఇస్తున్న గుర్తింపు, గౌరవం చూసి టీవీకేలో చేరాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. టీవీకే కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తామని, యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
అన్నామలైకి భారీగా మద్దతు.. ఏకంగా 14 లక్షల మంది..
అన్నామలై ఎఫెక్ట్.. రాజీనామాలు చేయవద్దని కోరిన నైనార్ నాగేంద్రన్