చిన్నారి పుట్టిన రోజు వేడుక.. దూసుకొచ్చిన బస్సు.. ఐదుగురు స్పాట్ డెడ్
ABN , Publish Date - Aug 22 , 2026 | 05:55 PM
రహదారి పక్కన నిర్వహిస్తున్న ఆర్కెస్ట్రాపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియా నగర సమీపంలో పరావ్ తోలా బంకట్వాలో జరిగింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 22: రహదారి పక్కన నిర్వహిస్తున్న ఆర్కెస్ట్రాపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియా నగర సమీపంలో పరావ్ తోలా బంకట్వాలో జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ బస్సు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుంచి బెట్టియాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. చిన్న పాప జన్మదినం సందర్భంగా ఈ ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని ఆ కుటుంబం నిర్వహించిందని పోలీసులు తెలిపారు.
అయితే ఈ ప్రమాదంలో ఆ పాప తండ్రి కూడా మరణించారని పోలీసులు చెప్పారు. మృతులందరిని గుర్తించామని పేర్కొన్నారు. అతి వేగంతో వెళ్తున్న బస్సు.. ఎదురుగా వస్తున్న ట్రక్కును తప్పించే క్రమంలో ఆర్కేస్ట్రా వైపు బస్సు దూసుకెళ్లిందని వివరించారు. ఈ కార్యక్రమం వద్ద ప్రజలు గుంపుగా ఉన్నారని పోలీసులు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల
జాబ్ క్యాలెండర్‌తో యువతకు అండగా ప్రభుత్వం: మంత్రి పార్థసారథి
For More National News And Telugu News