Share News

జాబ్ క్యాలెండర్‌తో యువతకు అండగా ప్రభుత్వం: మంత్రి పార్థసారథి

ABN , Publish Date - Aug 22 , 2026 | 02:37 PM

గత ప్రభుత్వంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే.. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై మంత్రి పార్థసారథి నిప్పులు చెరిగారు.

జాబ్ క్యాలెండర్‌తో యువతకు అండగా ప్రభుత్వం: మంత్రి పార్థసారథి
AP Minister Partha Sarathy

అమరావతి, ఆగస్టు 22: యువత భవిష్యత్తు, రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కె. పార్థసారథి స్పష్టం చేశారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర పరిపాలనలో ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికయ్యే అధికారుల పాత్ర అత్యంత కీలకమని ఆయన వివరించారు. శనివారం రాజధాని అమరావతిలో మంత్రి పార్థసారథి విలేకర్లతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు.


గత ప్రభుత్వంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే.. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఆయన నిప్పులు చెరిగారు. గొడ్డలి పోటుకి, గుండె పోటుకి ఎంత తేడా ఉందో.. గత వైసీపీ ఏపీపీఎస్సీకి, నేటి కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీకి అంత తేడా ఉందంటూ ఆ పార్టీ నేతలకు చురకలంటించారు. గొడ్డలి పార్టీ తలకిందులుగా తపస్సు చేసినా మెగా డీఎస్సీలో ఒక్క అక్రమాన్ని కూడా రుజువు చేయలేదని పేర్కొన్నారు.


ఏపీపీఎస్సీలో జరిగిన అవకతవకలను హైకోర్టు ఎత్తి చూపినా.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దున్నపోతు మీద వాన పడిన చందంగా మాట్లాడుతున్నారని వ్యంగ్యంగా అన్నారు. మెగా డీఎస్సీపై వందల కొద్దీ కేసులు వేసిన గొడ్డలి పార్టీ.. కోర్టుకు ఒక్క ఆధారాన్ని కూడా సమర్పించలేక పోయిందని అన్నారు. గొడ్డలి పార్టీ వేస్తున్న కేసుల వెనుక కుట్ర కోణం దాగుందని సాక్షాత్తూ హైకోర్టే మొట్టికాయలు వేసిందని చెప్పారు.


సాధారణంగా ప్రభుత్వ పరీక్షల జవాబు పత్రాలను పటిష్ట బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూములలో భద్రపరుస్తారని వివరించారు. కానీ వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ పరీక్షల జవాబుపత్రాలను ఎటువంటి భద్రత లేకుండా ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో ఉంచారని విమర్శించారు. అర్హత లేని వ్యక్తులతో ఆ పరీక్షల జవాబుపత్రాలను దిద్దించారని ఆరోపించారు. వైసీపీ పాలనలో గ్రూప్-1 పరీక్ష ప్రక్రియ మొత్తాన్ని ఏపీపీఎస్సీ చైర్మన్ గానీ, కమిటీ గానీ ఆమోదించకుండానే నిర్వహించారని చెప్పారు.


రూల్ 17, క్లాజ్ 19 ప్రకారం ఏపీపీఎస్సీ చేపట్టే ఏ ప్రక్రియకైనా కమిషన్ చైర్మన్ ఆమోదం తప్పనిసరి అని ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి గుర్తు చేశారు. అనాదిగా వస్తున్న నిబంధనలను తుంగలో తొక్కి డిజిటల్ మూల్యాంకనం ఎందుకు చేయించారో సమాధానం చెప్పాలని గొడ్డలి పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు మంత్రి పార్థసారథి డిమాండ్ చేశారు. ప్రజలు అమాయకులు, ఏది చెప్పినా నమ్ముతారనే భ్రమలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బతుకుతున్నారని అన్నారు.


ఏపీపీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణకు స్వయంగా హైకోర్టే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను నియమించిందని మంత్రి పార్థసారథి తెలిపారు. డిజిటల్ కరెక్షన్ కోసం కనీస ప్రామాణిక నిబంధనావళిని (SOP) కూడా రూపొందించ లేదని అన్నారు. ఏపీపీఎస్సీ నిబంధనలకు విరుద్ధంగా వైట్నర్‌తో జవాబుపత్రాలన్నింటినీ మార్చేశారని చెప్పారు.


హైకోర్టు నియమించిన సిట్ సమర్పించిన నివేదికపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ గొడ్డలి పార్టీ నేతలకు మంత్రి పార్థసారథి బహిరంగ సవాల్ విసిరారు. బటన్ నొక్కుడు మాటున వైసీపీ సాగించిన అక్రమాలను గమనించాలని ప్రజలకు సూచించారు. ఉద్దేశపూర్వకంగా అక్రమాలకు పాల్పడకపోతే డూప్లికేట్ ఓఎంఆర్ షీట్లను ఎందుకు సృష్టించారు? అని వైసీపీ నేతలను మంత్రి పార్థసారథి నిలదీశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్‌ను ఎలా రద్దు చేస్తారో చూస్తాం: వీహెచ్

అనకాపల్లికి గోదావరి నీళ్లు.. సెప్టెంబర్ నాటికి తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు

For More AP News And Telugu News

Updated Date - Aug 22 , 2026 | 02:45 PM