Share News

పంజాబ్ స్థానిక ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం.. అత్యధిక స్థానాలు కైవసం

ABN , Publish Date - May 29 , 2026 | 08:34 PM

ఢిల్లీలో సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల చేదు అనుభవాలను చవిచూసిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఎట్టకేలకు ఊరట లభించింది. ఆప్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రమైన పంజాబ్‌‌లో ఈనెల 26న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు శుక్రవారంనాడు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ఆప్ ఘనివిజయం సాధించింది.

పంజాబ్ స్థానిక ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం.. అత్యధిక స్థానాలు కైవసం
Bhagwant Mann and Arvind Kejriwal

ఛండీగఢ్: ఢిల్లీలో సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల చేదు అనుభవాలను చవిచూసిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కు ఎట్టకేలకు ఊరట లభించింది. ఆప్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రమైన పంజాబ్‌‌లో ఈనెల 26న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు శుక్రవారంనాడు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ఆప్ ఘనివిజయం సాధించింది.


పంజాబ్‌లోని 102 నగర పాలక సంస్థలకు ఈ ఎన్నికలు జరుగగా, వీటిలో 8 మున్సిపాలిటీలు, 75 మున్సిపల్ కౌన్సిళ్లు, 19 నగర పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 1,869 వార్డులకు గాను శుక్రవారం రాత్రి వరకు వెలువడిన ఫలితాల్లో 939 వార్డులను ఆప్ కైవసం చేసుకుంది. మొత్తం మున్సిపాలిటీల్లో సగానికి పైగా వార్డులను దక్కించుకుంది. 376 వార్డుల్లో కాంగ్రెస్ గెలిచి రెండో స్థానంలో నిలిచింది. సాద్-189, బీజేపీ-167 స్థానాలు గెలుచుకున్నాయి. బీఎస్‌పీ 7 వార్డులు దక్కించుకుంది.


ఈడీ పార్టీ గల్లంతు: కేజ్రీవాల్

పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించడంపై 'ఆప్' నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈడీ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని అన్నారు. పంజాబ్‌లోని చిన్న వ్యాపారులపై ఎన్నో దాడులు చేసి ప్రజలను వేదించిన ఈడీ పార్టీపై ప్రజలు ప్రతీకారం తీర్చుకున్నారని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో స్పందించారు. భగవంత్ సింగ్ మాన్ సారథ్యంలోని ఆప్ ప్రభుత్వానికి పంజాబ్ ప్రజలు ఇచ్చిన చారిత్రక తీర్పు ఇదని ప్రశంసించారు. భవిష్యత్తులో ఇదే రీతిలో ప్రజలు, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.


90 శాతం మున్సిపల్ కౌన్సిల్స్‌ను గెలుచుకున్నాం: మాన్

స్థానిక సంస్థల ఎన్నికల్లో 'ఆప్' ఘనవిజయంపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హర్షం వ్యక్తం చేశారు. 90 శాతం మున్సిపల్ కౌన్సిల్స్‌ను ఆప్ కైవసం చేసుకుందని చెప్పారు. విధానసభ, లోక్‌సభ, పంచాయతీ ఎన్నికలు, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్, నగర్ పంచాయతీ ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ రికార్డు స్థాయి విజయాలను నమోదు చేసుకుందన్నారు. 90 శాతానికి పైగా మున్సిపల్ కౌన్సిల్‌లో తమ అభ్యర్థులు గెలిచారని చెప్పారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో 'ఆప్' ఘనవిజయంతో పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకొంటున్నారు.


ఇవి కూడా చదవండి..

అబోహర్‌లో బీజేపీ విజయకేతనం.. తొలిసారి మేయర్‌ పదవి కైవసం

ఆయన ఎన్నో సార్లు డిప్రెషన్‌కు గురయ్యారు.. డీకే జ్యోతిష్యుడు

Updated Date - May 29 , 2026 | 08:38 PM