ఆయన ఎన్నో సార్లు డిప్రెషన్‌కు గురయ్యారు.. డీకే జ్యోతిష్యుడు
ABN , Publish Date - May 29 , 2026 | 06:02 PM
కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్‌గా, విశ్వసనీయుడిగా, 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్ ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ పదవి ఆయనను అంత తేలిగ్గా వరించలేదని డీకే జ్యోతిష్యుడు బెల్లూర్ ద్వారకానాథ్ తెలిపారు.
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్‌గా, విశ్వసనీయుడిగా, 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన నేతగా పేరున్న డీకే శివకుమార్ ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ పదవి ఆయనను అంత తేలిగ్గా వరించలేదని డీకే జ్యోతిష్యుడు బెల్లూర్ ద్వారకానాథ్ (Bellur Dwarakanath) తెలిపారు. 'ఇందుకోసం ఎన్నో కష్టాలు, బాధలు ఎదుర్కొన్నారు. నా సూచనలను పాటిస్తూ పట్టుదలగా అనుకున్న లక్ష్యాన్ని సాధించారు' అని మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారంనాడు రాజీనామా చేయడంతో డీకే శివకుమార్ సీఎం పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. శనివారం జరుగనున్న కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ సమావేశంలో డీకే శివకుమార్ సీఎల్‌పీ నేతగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అనంతరం ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు.
సిద్ధరామయ్య డిప్యూటీగా (ఉప ముఖ్యమంత్రి)గా డీకే మూడేళ్లు పనిచేయడంపై ద్వారకనాథ్ మాట్లాడుతూ, ఆయన చాలా పట్టుదల గల వ్యక్తి అని, అనుకున్నది సాధించే మనస్తత్వం కలిగిన నేత అని చెప్పారు. 'చివరి వరకూ పోరాడే వ్యక్తి ఆయన. అది ఆయన లక్షణం. ముఖ్యమంత్రి కావాలనుకుని ప్రయత్నించి ఆ క్రమంలో పలుమార్లు ఏడ్చారు, డిప్రెషన్‌లోకి కూడా వెళ్లారు. దాదాపు ఆ ఆశ కూడా ఒదులుకున్నారు. అయితే ప్రతిసారి ఆయనను నేను ప్రోత్సహిస్తూ వచ్చా. ధైర్యం కోల్పోవద్దని, ఏదో ఒకనాడు సీఎం అవుతారని చెప్పేవాడిని. ఏదైతే చెప్పానో అదే ఇప్పుడు జరుగుతోంది' అని ద్వారకానాథ్ అన్నారు.
జర జాగ్రత్త..
శివకుమార్ ముఖ్యమంత్రి కావడానికి మార్గం సుగమమైనందున బాధ్యతలు చేపట్టాలని తాను సూచించినట్టు ద్వారకానాథ్ చెప్పారు. అయితే మార్గం ముళ్లతో ఉంటుందని, వినయం, కఠోర పరిశ్రమతో ముందుకు సాగాలని తాను సూచించినట్టు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి పదవికి ఆయన అనర్హులని అనే వాళ్లు కూడా ఉంటారని, అయితే వాటిని పట్టించుకోకుండా ప్రజల కోసం మాత్రమే పనిచేయాలని తాను సలహా ఇచ్చినట్టు చెప్పారు. 'కావాలని విమర్శించే వారిని ఆయన పక్కకు పెట్టేయాలి. వాళ్లెవరైనా సరే దూరంగా ఉంచాలి. రాష్ట్రం కోసమే పనిచేయాలి. అప్పుడే ఆయన సక్సెస్ అవుతారు' అని ద్వారకానాథ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ డీకే శివకుమార్‌కు ఎన్నో ఆశలతో ముఖ్యమంత్రి పదవిని అప్పగించబోతోందని చెప్పారు.
ఎలా ఉండాలంటే..
'కష్టపడిన వాళ్లనే సక్సెస్ వరిస్తుంది. సీఎం పదవిపై డీకే కూర్చున్నప్పటి నుంచి మంచి వర్షాలు కురియాలని, మంచి వాతావరణం నెలకొనాలని ఆశిస్తున్నాను. పాలకులు సన్యాసిలా వ్యవహరించాలి. ప్రతీదీ వదులుకోవాలి. కర్ణాటక కోసం ఆయన పనిచేస్తారని, అవినీతి రహిత రాష్ట్రంగా, అభివృద్ధిగా దిశగా రాష్ట్రాన్ని పయనించేలా చేస్తారని ఆశిస్తున్నాను. తమిళనాడుతో కానీ ఆంధ్రప్రదేశ్‌తో కానీ విభేదాలు కూడదు. అదే నేను కోరుకుంటున్నాను' అని ద్వారకానాథ్ పేర్కొన్నారు. కాగా, ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్న డీకే శివకుమార్ సైతం సిద్ధరామయ్య రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. తాను కేపీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకూ సిద్ధరామయ్య తనకు వెన్నుదన్నుగా నిలిచారంటూ ప్రశంసలు కురిపించారు.
ఇవి కూడా చదవండి..
జూన్ 1న డీకే ప్రమాణస్వీకారం.. సిద్ధరామయ్య తనయుడికి డిప్యూటీ సీఎం!
వందేమాతరంపై మళ్లీ రగడ.. కేరళ గవర్నర్ అసంతృప్తి