జూన్ 1న డీకే ప్రమాణస్వీకారం.. సిద్ధరామయ్య తనయుడికి డిప్యూటీ సీఎం!
ABN , Publish Date - May 29 , 2026 | 02:46 PM
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాతో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనుండటం ఖాయమైంది. నాయకత్వ మార్పు నేపథ్యంలో తన కుమారుడు, ఎమ్మెల్యే యతీంద్ర సిద్ధరామయ్యకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సిద్ధరామయ్య కోరినట్టు పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం.
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) రాజీనామాతో డీకే శివకుమార్ (DK Shivakumar) ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనుండటం ఖాయమైంది. నాయకత్వ మార్పు నేపథ్యంలో తన కుమారుడు, ఎమ్మెల్యే యతీంద్ర సిద్ధరామయ్యకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పార్టీ అధిష్ఠానాన్ని సిద్ధరామయ్య కోరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కీలకమైన సీఎల్‌పీ నేత ఎన్నిక శనివారంనాడు జరుగనుంది. సీఎల్‌పీ నేతగా డీకే ఎన్నికైన అనంతరం ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. జూన్ 1న డీకే సర్కార్ ప్రమాణస్వీకారం చేయనుంది. అంతవరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగుతారు.

కాగా, మంత్రివర్గ కూర్పుపై ఢిల్లీలో సిద్ధరామయ్య, డీకే పార్టీ అధిష్ఠానంతో వరుస సమావేశాలు జరుపుతున్నారు. ఈ సమావేశంలో సిద్ధరామయ్య తన డిమాండ్లను అధిష్ఠానం ముందుంచినట్టు చెబుతున్నారు. యతీంద్ర సిద్ధరామయ్యకు ఉపమఖ్యమంత్రి పదవిని సిద్ధరామయ్య ఆశిస్తున్నారు. దీనితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కేజే జార్జి, జి.పరమేశ్వరలకు క్యాబినెట్‌లో చేటు కల్పించాలని సిద్ధరామయ్య కోరినట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరూ కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్ష పదవిని ఆశించడం లేదని ఆయన వివరించినట్టు తెలిసింది.
రేపు సీఎల్‌పీ సమావేశం
కాగా, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం శనివారంనాడు జరుగునున్నట్టు మీడియాతో మాట్లాడుతూ శివకుమార్ తెలిపారు. కేంద్ర నాయకులు వస్తున్నారని, పార్టీ ఎమ్మెల్యేలంతా బెంగళూరులోనే ఉండాల్సిందని కోరామని ఆయన చెప్పారు.
ఖర్గేను కలిసిన సిద్ధరామయ్య
మరోవైపు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఆయన నివాసంలో సిద్ధరామయ్య కలిసారు. కర్ణాటక మంత్రులు ప్రియాంక్ ఖర్గే, కేసీ జార్జ్, యతీంద్ర సిద్ధరామయ్య ఆయన వెంట ఖర్గేను కలిసిన వారిలో ఉన్నారు. దీనికి మందు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, విపక్ష నేత రాహుల్ గాంధీని 10 జన్‌పథ్‌లో సిద్ధరామయ్య కలిసారు. మర్యాదపూర్వకంగానే కేంద్ర నేతలను సిద్ధరామయ్య కలిసినట్టు కర్ణాటక కాంగ్రెస్ ఇన్‌చార్జి రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు. కాంగ్రెస్ అధిష్ఠానం సూచనల మేరకు సిద్ధరామయ్య తన పదవికి గురువారంనాడు రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదించేందుకు, మంత్రిమండలిని రద్దు చేసేందుకు గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ లాంఛనంగా అంగీకరించారు. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగేంత వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిందిగా సిద్ధరామయ్యకు గవర్నర్ సూచించారు.
ఇవి కూడా చదవండి..
సిద్దరామయ్య 'లాస్ట్ పంచ్'.. కుల గణన నివేదిక ఆమోదంతో డీకే, రాహుల్‌కు చెక్!
రెండేళ్లలో చరిత్ర తిరగరాయగలరా? కర్ణాటక కాబోయే సీఎం డీకే ముందున్న సవాళ్లేమిటి?