వందేమాతరంపై మళ్లీ రగడ.. కేరళ గవర్నర్ అసంతృప్తి
ABN , Publish Date - May 29 , 2026 | 04:29 PM
కేరళ రాజకీయాల్లో మరోసారి 'వందేమాతరం'పై వివాదం చోటుచేసుకుంది. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పాలసీ అడ్రస్ సందర్భంగా అసెంబ్లీలో 'వందేమాతరం' గేయాన్ని పూర్తి స్థాయిలో పాడకపోవడంపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ శుక్రవారంనాడు అసంతృప్తి వ్యక్తం చేసారు.
తిరువనంతపురం: కేరళ రాజకీయాల్లో మరోసారి 'వందేమాతరం'పై వివాదం చోటుచేసుకుంది. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) పాలసీ అడ్రస్ సందర్భంగా అసెంబ్లీలో 'వందేమాతరం' గేయాన్ని పూర్తిస్థాయిలో పాడకపోవడంపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ శుక్రవారంనాడు అసంతృప్తి వ్యక్తం చేసారు. అసెంబ్లీ నుంచి బయటకు వస్తూ మీడియాతో ఆయన మాట్లాడారు. అధికారిక కార్యక్రమాల్లో గవర్నర్ ఎప్పుడు హాజరైనా సరైన ప్రోటాకాల్ పాటించాల్సి ఉంటుందని అన్నారు.
కేరళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ముందు, తరువాత ఒక బ్యాండ్ టీమ్ 'వందేమాతరం' గేయంలోని మొదటి చరణాలను మాత్రమే ప్లే చేసింది. దీనిపై గవర్నర్ మాట్లాడుతూ, గవర్నర్ ఎప్పుడు హాజరైనా వందేమాతర గేయాన్ని పూర్తిగానే పాడాల్సి ఉంటుందని అన్నారు. 'గేయాన్ని ఆలపించలేదు, ప్లే మాత్రమే చేశారు' అని చెప్పారు. అసెంబ్లీ స్పీకర్ తిరువాంచూర్ రాధాకృష్ణన్‌తో తాను ఇప్పటికే మాట్లాడానని, ఏం జరుగుతోందో చూద్దామని అన్నారు.
గవర్నర్‌ను అమానించడమే..
కాగా, ప్రభుత్వ విధానాలపై గవర్నర్ శుక్రవారంనాడు ప్రసంగించిన సమయంలో వందేమాతరం గేయాన్ని పూర్తిస్థాయిలో ఆలపించకపోవడాన్ని బీజేపీ తప్పుపట్టింది. ఇది లోక్‌భవన్, గవర్నర్‌ను అవమానపరచడమేనని పేర్కొంది. గవర్నర్ ఎప్పుడు హాజరైనా జాతీయగేయం వందేమాతరాన్ని పూర్తి స్థాయిలో వినిపించాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలున్నాయని బీజేపీ సీనియర్ నేత, కాలకూట్టం ఎమ్మెల్యే వి.మురళీధరన్ తెలిపారు. అయితే కేరళ ప్రభుత్వం కేంద్రం ఆదేశాలను పాటించలేదన్నారు. వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో ఇలా చేయడం జాతీయగేయానికే అవమానమని విమర్శించారు. వీడీ సతీశ్ సారథ్యలోని యూడీఎఫ్ ప్రభుత్వం జమాతే ఇస్లామీ, సీపీఎం అభిప్రాయాలకు తలొగ్గుతోందని ఆరోపించారు. జాతీయగేయం సెక్యులర్ లైన్స్‌లో లేదంటూ ఆ పార్టీలు చేస్తున్న వాదనతో ప్రభుత్వం ఏకీభవించినట్టు స్పష్టమవుతోందని అన్నారు.
ఇవి కూడా చదవండి..
జూన్ 1న డీకే ప్రమాణస్వీకారం.. సిద్ధరామయ్య తనయుడికి డిప్యూటీ సీఎం!
దేవాలయాల్లో ప్రత్యేక దర్శనాలపై పిటిషన్.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు