Share News

దేవాలయాల్లో ప్రత్యేక దర్శనాలపై పిటిషన్.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - May 29 , 2026 | 03:46 PM

దేవాలయాల్లో వీఐపీ సంస్కృతి, ప్రత్యేక దర్శనాలపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేవుడి ముందు అందరూ సమానమేనని స్పష్టం చేసింది. ప్రత్యేక దర్శనాలను సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌పై ప్రభుత్వం స్పందించేందుకు ఆరు వారాల గడువు ఇచ్చింది.

దేవాలయాల్లో ప్రత్యేక దర్శనాలపై పిటిషన్.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Madras High Court on VIP culture in Temples

ఇంటర్నెట్ డెస్క్: దేవాలయాల్లో వీఐపీ సంస్కృతిపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవాలయంలో దేవుడొక్కడే వీఐపీ అని వ్యాఖ్యానించింది. భగవంతుడు ఎవరి కోసమూ వేచి ఉండడన్న న్యాయస్థానం.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. దేవుడి ముందు అందరూ సమానమేనని స్పష్టం చేసింది. ఆలయాల్లో స్పెషల్, పెయిడ్ దర్శనాలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలు తప్ప ఎవరికీ ప్రత్యేక మర్యాదలు వద్దని పిటిషనర్లు తమ వ్యాజ్యంలో పేర్కొన్నారు.


ఈ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వీఐపీల కోసం సామాన్య భక్తులను క్యూ లైన్లలో వేచి ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు తాము ప్రత్యేకమని భావించవద్దని స్పష్టం చేసింది. ఎక్కువ డబ్బులు వసూలు చేసి ప్రత్యేక దర్శనాలు కల్పించడం ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వ హక్కును ఉల్లంఘించడమేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. వీఐపీ సంస్కృతి, పెయిడ్ దర్శనాల రద్దుపై సమాధానం చెప్పాలని తమిళనాడు ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 6 వారాల పాటు న్యాయస్థానం వాయిదా వేసింది.


ఈ వార్తలనూ చదవండి:

భారత్‌లోకి ఎలా వచ్చారో చెప్పిన బంగ్లాదేశీ అక్రమ వలసదారులు

సోనియా, రాహుల్ గాంధీలతో సిద్దరామయ్య భేటీ..

Updated Date - May 29 , 2026 | 04:05 PM