ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్.. బీజేపీ గూటికి రాఘవ్ చద్దా
ABN , Publish Date - Apr 24 , 2026 | 04:25 PM
ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాఘవ్ చద్దా రాజీనామా చేశారు. తాను బీజేపీలో చేరనున్నట్లు చద్దా తెలిపారు.
ఢిల్లీ, ఏప్రిల్ 24: ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాఘవ్ చద్దా రాజీనామా చేశారు. తాను బీజేపీలో చేరనున్నట్లు చద్దా తెలిపారు. తాను తప్పుడు పార్టీలో ఉన్న సరైన వ్యక్తినంటూ చద్దా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఆయన్ను పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నుంచి ఆప్ తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా రాఘవ్ చద్దాతో సహా ఏడుగురు ఎంపీలు ఆప్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం చద్దా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇవాళ(శుక్రవారం)సీనియర్ ఎంపీలు అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్‌లతో కలిసి చద్దా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభలోని ఆప్ ఎంపీలలో దాదాపు 2/3 వంతు మంది బీజేపీలోకి చేరుతారని చద్దా అన్నారు. అవినీతిపై పోరాడతామని హామీలతో ఒకప్పుడు ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ(ఆప్), విలువలతో కూడిన రాజకీయాలకు దూరమవుతోందని ఆయన ఆరోపించారు. బీజేపీలో చేరనున్న వారిలో ఆప్ నేతల్లో హర్భజన్ సింగ్, స్వాతి మాలివాల్ ఉన్నారని చద్దా వెల్లడించారు. తన జీవితంలోని 15 ఏళ్లను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కోసం అంకితం చేశానని, తాను తప్పుడు పార్టీలో ఉన్న సరైన వ్యక్తిని అన్నారు. తాను పార్టీకి దూరమై ప్రజలకు దగ్గరవుతున్నానని ఆయన అన్నారు.
పదవుల తొలగింపు, అవమానాల వల్లే పార్టీని వీడుతున్నట్లు ఆప్ అసంతృప్త నేతలు ప్రకటించారు. కేజ్రీవాల్‌తో పెరిగిన విభేదాలే ప్రధాన కారణమని, పార్టీ ఇప్పుడు తన సిద్ధాంతాలను కోల్పోయిందని ఆరోపించారు. 2/3 వంతు సభ్యులు కావడంతో 'పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం' నుంచి ఈ ఎంపీలకు ఊరట లభించనుంది. ఏడుగురు ఎంపీల రాజీనామాతో రాజ్యసభలో ఒక్కసారిగా ఆప్ బలం పడిపోయింది. ఆప్ ఎంపీల చేరికతో రాజ్యసభలో బీజేపీ బలం పెరగనుంది. ఆప్ ఎంపీల సామూహిక వలస ఢిల్లీ, పంజాబ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
రాజ్యసభలో ఆప్‌నకు 10 మంది ఎంపీలు ఉండగా.. వారిలో మెజార్టీ సభ్యులు(ఏడుగురు) పార్టీకి రాజీనామా చేశారు. రాఘవ్ చద్దాను ఒక పావుగా వాడి తమ పార్టీలో చీలిక తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపించింది. ఏడుగురు ఎంపీలను తీసుకువస్తే.. మంత్రిని చేస్తామని చద్దాకు కేంద్రమంత్రి అమిత్ షా చెప్పినట్టుగా తమకు సమాచారం ఉందని వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని బీజేపీ(BJP) తోసిపుచ్చింది.
ఇవి కూడా చదవండి:
హెల్తీ పీనట్ బటర్ రెసిపీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా
సీఎం ఆకస్మిక తనిఖీ ఎఫెక్ట్.. 162 మంది అధికారులు బదిలీ