సీఎం ఆకస్మిక తనిఖీ ఎఫెక్ట్.. 162 మంది అధికారుల బదిలీ
ABN , Publish Date - Apr 24 , 2026 | 04:02 PM
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆకస్మిక తనిఖీ రాష్ట్ర జీఎస్టీ శాఖలో పెను మార్పుకు దారితీసింది. ఆమె పర్యటన తర్వాత ఆ కార్యాలయం నుంచి ఏకంగా 162 మంది అధికారులు, సిబ్బంది బదిలీ అయ్యారు.
ఢిల్లీ, ఏప్రిల్ 24: ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆకస్మిక తనిఖీ రాష్ట్ర జీఎస్టీ శాఖలో పెను మార్పులకు దారితీసింది. ఏకంగా 162 మంది అధికారులు, సిబ్బంది బదిలీ అయ్యారు. ఈ నెల 8న సీఎం రేఖా గుప్తా రాష్ట్ర జీఎస్టీ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఆ సమయంలో అధికారుల హాజరులో లోపాలు, సమయపాలన పాటించకపోవడం, పన్ను చెల్లింపుదారుల సేవల్లో నిర్లక్ష్యంగా ఉన్నట్లు ఆమె గుర్తించారు. ఈ క్రమంలో అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనిఖీ సందర్భంగా సీఎం రేఖా గుప్తా జీఎస్టీ కార్యాలయంలోని అధికారుల పనితీరును సమీక్షించారు. ఆఫీసులోని వివిధ విభాగాలను ఆమె పరిశీలించారు. అంతేకాక ఆర్థిక అంశాలకు సంబంధించి అధికారులతో మాట్లాడారు. అక్కడ కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో పన్ను చెల్లింపుదారులతో కాసేపు ఆమె సంభాషించారు. పన్ను చెల్లింపు సేవలు ఆలస్యం కావడం, సాధారణ పనుల కోసం పదేపదే రావడం, పనివేళల అధికారులు తక్కువగా ఉండటం వంటి సమస్యలపై సీఎం రేఖా గుప్తాకు వినియోగదారులు ఫిర్యాదు చేశారు.
హాజరు, సమయపాలన నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, బయోమెట్రిక్ హాజరు రికార్డులను ధ్రువీకరించాలని, సేవా పంపిణీ యంత్రాంగాలను తక్షణమే బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. తాజాగా ఆమె పర్యటించిన జీఎస్టీ కార్యాలయం నుంచి ఏకంగా 162 మంది ఉద్యోగులు బదిలీ అయ్యారు. వీరిలో ముగ్గురు అసిస్టెంట్ కమిషనర్లు, 58 మంది సెక్షన్ ఆఫీసర్లు (గ్రేడ్-1), 22 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు (గ్రేడ్-2), 74 మంది సీనియర్ అసిస్టెంట్లు (గ్రేడ్-3), 5 మంది జూనియర్ అసిస్టెంట్లు (గ్రేడ్-4) ఉన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఇలాంటి చర్యలు చేపడుతున్నట్లు సీఎంవో అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
పురాతన ఆలయాల పునఃనిర్మాణానికి రూ.800 కోట్లు: మంత్రి ఆనం రామనారాయణ
భారత్ నుంచి ప్రపంచానికి షాపింగ్ మరింత సులభం