బెంగాల్ రీపోలింగ్.. 90 శాతం పోలింగ్ నమోదు
ABN , Publish Date - May 02 , 2026 | 09:35 PM
పశ్చిమబెంగాల్ సౌత్ 24 పరగణాల జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 15 పోలింగ్ బూత్‌లలో శనివారంనాడు రీపోలింగ్ ముగిసింది. 90 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికార వర్గాలు తెలిపాయి.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సౌత్ 24 పరగణాల జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 15 పోలింగ్ బూత్‌లలో శనివారంనాడు రీపోలింగ్ ముగిసింది. మగ్రహాట్ పశ్చిమ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 11 పోలింగ్ స్టేషన్లు, డైమండ్ హార్బర్‌లోని 4 పోలింగ్ స్టేషన్లలో ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటలతో ముగిసింది. 90 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికార వర్గాలు తెలిపాయి.
ఫాల్టాలో ఉద్రిక్తత.. టీఎంసీపై స్థానికుల ఫిర్యాదు
కాగా, ఉదయం 11 గంటల వరకూ ఎలాంటి ఘటనలు జరగనప్పటికీ ఆ తర్వాత సౌత్ 24 పరగణాల జిల్లాలోని ఫాల్టాలో టీఎంసీ, బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ బూత్‌లకు వెళ్లకుండా టీఎంసీ కార్యకర్తలు ఓటర్లను అడ్డుకున్నట్టు బీజేపీ కార్యకర్తలు ఆరోపించగా, ఓటింగ్ ప్రక్రియకు బీజేపీ కార్యకర్తలు అడ్డుపడుతున్నట్టు టీఎంసీ కార్యకర్తలు ఆరోపించారు. దీనికితోడు, ఫాల్టాలో స్థానికులు ఆందోళన బాటపట్టడం ఉద్రిక్తతలకు దారితీసింది. టీఎంసీ గూండాలు తమను బెదిరిస్తున్నారని, కేంద్ర బలగాలైన సీఏపీఎఫ్‌ను మోహరించి తమకు రక్షణ కల్పించాలని స్థానికులు రోడ్లపైకి వద్ద ఆందోళనలకు దిగారు. అధికారులు వెంటనే స్పందించడంలో సీఆర్‌పీఎఫ్, ఆర్‌పీఎఫ్ దళాలను మోహరించారు. టీఎంసీ గూండాలు బెదిరిస్తున్నారని, వారు గెలిస్తే తమ ఇళ్లు తగులబెడతారని, రక్తపాతం తప్పదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు భారీగా బలగాలను మోహరించినా టీఎంసీ గూండాల హింస, ఆందోళనకు ఆగడం లేదని బీజేపీ ఆరోపించింది. పశ్చిమబెంగాల్‌లోని ఒక స్ట్రాంగ్‌రూమ్‌ను అనుమతి లేకుండా కొందరు తెరిచారని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనలను ఈసీ సీరియస్‌గా తీసుకుందని, స్థానికులను బెదిరించిన టీఎంసీ గూండాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించిందని అధికారులు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
200 ప్లస్ సీట్లతో మనమే గెలుస్తాం.. మమతా బెనర్జీ ధీమా
బెంగాల్‌లో కౌంటింగ్‌కు అదనపు పరిశీలకులు.. ఈసీ మరో కీలక నిర్ణయం