Share News

బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

ABN , Publish Date - Nov 22 , 2026 | 12:38 PM

బిహార్‌లోని పట్నా జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో వాహనాన్ని ఓ లారీ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.

బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లోని పట్నా జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో వాహనాన్ని ఓ లారీ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. అథ్‌మల్‌గోలా పోలీస్‌స్టేషన్ పరిధిలోని సబ్నిమా పెట్రోల్‌ పంప్ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో స్కార్పియో డ్రైవర్ ధీరజ్ కుమార్ (26), పూనమ్ కుమారి (27), బబ్లీ కుమారి (18), రేణు కుమారి (18) అక్కడికక్కడే మృతి చెందారు. బర్హ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సికంద్రా గ్రామం నుంచి బఖ్తియార్‌పూర్‌లోని బెల్థాన్ గ్రామానికి వివాహ ఊరేగింపు వెళ్లింది. పెళ్లి వేడుక ముగిసిన అనంతరం పెళ్లి బృందం స్కార్పియోలో తిరిగి స్వగ్రామానికి బయలుదేరింది. ఈ క్రమంలో సబ్నిమా పెట్రోల్‌ పంప్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ.. పెళ్లి బృందం వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో నలుగురు చనిపోగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో వాహనం కూడా ధ్వంసమైంది.


ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ముగ్గురిని బర్హ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పట్నాలోని పట్నా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం బర్హ్ సబ్‌డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక

భారత్‌ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక

Updated Date - Nov 22 , 2026 | 12:38 PM