Share News

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతి

ABN , Publish Date - Nov 22 , 2026 | 09:51 AM

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. కచ్ జిల్లాలో ట్రక్కు, కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృత్యువాతపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో విషాదం అలుముకుంది.

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతి
Gujarat Road Accident

ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భుజ్‌-ఖవ్డా జాతీయ రహదారిపై శనివారం రాత్రి ట్రక్కు, కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ఉత్తరాఖండ్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందినవారిగా.. ఆర్మీ కుటుంబాల నేపథ్యం ఉన్నవారిగా గుర్తించారు.

రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో కారు భుజ్‌ వైపు వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న ట్రైలర్ ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జై రెండుగా చీలిపోయింది. ఈ ఘటనలో సౌరవ్‌సింగ్ జస్పాల్‌సింగ్ నేగి (32), ఆయన భార్య సవిత, మూడు నెలల కుమార్తె శివిక, రింకి నితిన్ గున్‌సాయి, ఆమె కుమార్తె వామిక, రాజేష్ సింగ్ రావత్, ఆయన ఏడేళ్ల కుమార్తె రక్షిత మృతి చెందారు.


ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టగా.. అధికారులు పెద్ద సంఖ్యలో అంబులెన్సులను పంపించారు. ప్రాథమిక విచారణలో మృతులు సైనిక కుటుంబాలకు చెందినవారని వెల్లడైంది. సమాచారం అందుకున్న భారత సైనిక అధికారులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, గత అక్టోబర్ 9న ఖవ్డా పునరుత్పాదక ఇంధన పార్క్ రోడ్డుపై జరిగిన మరో ఘోర ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఆ ఘటన మరువకముందే మరోసారి అదే ప్రాంతంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.


ఈ వార్తలనూ చదవండి:

డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక

భారత్‌ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక

Updated Date - Nov 22 , 2026 | 09:51 AM