Share News

బీజేపీతో టచ్‌లో 20 మంది టీఎంసీ ఎంపీలు, 50 మంది ఎమ్మెల్యేలు

ABN , Publish Date - May 27 , 2026 | 03:19 PM

పశ్చిమబెంగాల్‌లో సుదీర్ఘ పాలనకు తెరపడటంతో చిక్కుల్లో పడిన మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మరిన్ని చిక్కులు తప్పలే కనిపించడం లేదు. ఆ పార్టీకి చెందిన సుమారు 20 మంది ఎంపీలు, 50 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ తాజాగా బాంబు పేల్చారు.

బీజేపీతో టచ్‌లో 20 మంది టీఎంసీ ఎంపీలు, 50 మంది ఎమ్మెల్యేలు
Mamata Banerjee and Saumitra Khan

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో సుదీర్ఘ పాలనకు తెరపడటంతో చిక్కుల్లో పడిన మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి మరిన్ని చిక్కులు తప్పలే కనిపించడం లేదు. ఆ పార్టీకి చెందిన సుమారు 20 మంది ఎంపీలు, 50 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ (Saumitra Khan) తాజాగా బాంబు పేల్చారు.


బుధవారంనాడిక్కడ మీడియాతో సౌమిత్రా ఖాన్ మాట్లాడుతూ, టీఎంసీ ఎంపీలు ఆ పార్టీలో కొనసాగే విషయంలో సంతోషంగా లేరని, బీజేపీ నేతలతో సంప్రదింపులు సాగిస్తున్నారని చెప్పారు. '20 మంది నేతలు మాతో టచ్‌లో ఉన్నారు. పార్టీ నాయకత్వం కోరుకుంటే వాళ్లంతా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో టీఎంసీ మొత్తం ఖాళీ అవుతుంది' అని అన్నారు. అయితే బీజేపీతో సంప్రదింపులు సాగిస్తున్న టీఎంసీ ఎంపీల పేర్లను సౌమిత్రా ఖాన్ వెల్లడించలేదు.


పశ్చిమబెంగాల్‌‌ నుంచి మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో టీఎంసీకి ప్రస్తుతం 29 మంది ఎంపీలు ఉన్నారు. బీజేపీకి 12, కాంగ్రెస్‌కు ఒక ఎంపీ ఉన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఒక పార్లమెంటరీ పార్టీకి చెందిన మూడింట రెండు వంతుల మంది పార్టీ మారాలనుకుంటే వారిపై అనర్హత వేటు పడదు. టీఎంసీ విషయానికి వస్తే టీఎంసీకి 29 మంది ఎంపీలు ఉన్నందుకు 19 నుంచి 20 మంది ఎంపీలు పార్టీ మారితే అనర్హత వేటు నుంచి వారు తప్పించుకునే వీలుంది.


అంతా బోగస్..

కాగా, టీఎంసీ ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నారని, ఏ క్షణంలోనైనా పార్టీకి ఉద్వాసన చెప్పవచ్చని సౌమిత్రా ఖాన్ చేసిన వ్యాఖ్యలను బోగస్‌గా టీఎంసీ కొట్టివేసింది. అలాంటిదేమీ జరగదని ఆ పార్టీ సీనియర్ ఎంపీ సౌగత రాయ్ తెలిపారు. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలువురు టీఎంసీ కీలక నేతలు బీజేపీలో చేరారు. అయితే వారిలో చాలామంది టీఎంసీ తిరిగి అధికారం నిలుపుకోవడంతో బీజేపీ నుంచి వెనక్కి వచ్చేశారు. అయితే ఈసారి మాత్రం రాజకీయ సమీకరణలు భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు 15 ఏళ్ల టీఎంసీ పాలనకు గండికొట్టి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈసారి టీఎంసీ ఓటమి తర్వాత పార్టీలో పలువురు నాయకులు బాహాటంగానే పార్టీపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

కర్ణాటక కొత్త సీఎం ప్రమాణస్వీకారం మే 30..! ఈసారి ముగ్గురు డిప్యూటీ సీఎంలు

శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో బంగారం, వజ్రాల ఆభరణాలు అదృశ్యం..

Updated Date - May 27 , 2026 | 04:36 PM