విషాదం.. విద్యుత్ స్తంభం కూలి బాలుడి మృతి
ABN , Publish Date - Jul 15 , 2026 | 07:58 AM
గుజరాత్‌లోని ఖేడాలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్తుండగా ఓ బాలుడిపై కరెంట్ స్తంభం కూలి మీదపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆరుగురు అక్కాచెల్లెళ్లకు ఒక్కడే సోదరుడు కావడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఉదయాన్నే భుజానికి స్కూల్ బ్యాగ్ తగిలించుకుని పాఠశాలకు బయలుదేరిన బాలుడికి, మార్గమధ్యంలో మృత్యువు ఎదురైంది. విద్యుత్ స్తంభం కూలి మీద పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషాద ఘటన గుజరాత్‌లోని ఖేడా జిల్లా, మహేమదావాడ్ ప్రాంతంలో జరిగింది.
అమ్సారాన్ గ్రామానికి చెందిన కృష్ణ అజయ్ కుమార్ యాదవ్(11) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. రోజూ లాగే ఉదయం వేళ పాఠశాలకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయల్దేరాడు. ఇంతలో గ్రామంలోని విద్యుత్ తీగల వద్దనున్న ఓ చెట్టు కొమ్మలను నరికారు. అకస్మాత్తుగా అది హైటెన్షన్ విద్యుత్ తీగలపై పడింది. దాని తాకిడికి బరువైన కరెంట్ స్తంభం అటుగా వెళ్తున్న విద్యార్థిపై పడింది. దానికింద నలిగిపోయిన ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ప్రమాదం గురించి తెలియగానే స్థానిక పోలీస్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే.. మరో హృదయ విదారక విషయం ఏంటేంటే.. మృతుడు కృష్ణ యాదవ్ తన తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. ఆరుగురు అక్కాచెల్లెళ్లకు ఒక్కడే సోదరుడు కావడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
నా వంట నేనే చేసుకుంటా.. తిహాడ్ జైల్లోని అమెరికన్ ఖైదీ పిటిషన్
వరద నీటిలో 900 పాములు.. నరకం చూస్తున్న చైనా ప్రజలు..