Share News

వయసు కేవలం సంఖ్య మాత్రమే.. 80 ఏళ్ల వయసులో వృద్ధురాలి సాహసం..

ABN , Publish Date - Jul 12 , 2026 | 07:20 PM

వయసు పెరిగిందని కలలను వదులుకోవాల్సిన అవసరం లేదని ఓ వృద్ధురాలు(80) నిరూపించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటారు మార్గంగా పేరున్న లడఖ్‌లోని ఉమ్లింగ్ లా పాస్‌ను చేరుకుని ఆమె అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.

వయసు కేవలం సంఖ్య మాత్రమే.. 80 ఏళ్ల వయసులో వృద్ధురాలి సాహసం..

న్యూఢిల్లీ: వయసు పెరిగిందని కలలను వదులుకోవాల్సిన అవసరం లేదని ఓ వృద్ధురాలు(80) నిరూపించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటారు మార్గంగా పేరున్న లడఖ్‌లోని ఉమ్లింగ్ లా పాస్‌ను చేరుకుని ఆమె అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. శారీరక సవాళ్లు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను లెక్కచేయకుండా ఈ వృద్ధురాలు చేసిన సాహసం యువతను ఆశ్చర్యానికి గురి చేసింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రయాణ సంస్థ ‘ది ట్రావెలిస్ట్’ ఈ సాహసయాత్రకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.


వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం.. భారీగా మంచు కురుస్తుండగా బామ్మ నవ్వుతూ కారు దిగారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్లింగ్ లా బోర్డు వద్ద నిలబడి వీడియోలు, ఫొటోలకు ఫోజులిచ్చారు. దీనిని ‘ది ట్రావెలిస్ట్’ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. 'మనసు యవ్వనంగా ఉంటే వయసు అడ్డంకి కాదు' అంటూ క్యాప్షన్ పెట్టింది. అలాగే, '80 ఏళ్ల వయసులో దాదీజీ 19,024 అడుగుల ఎత్తులో ఉన్న ఉమ్లింగ్ లా పాస్‌ను చేరుకున్నారు. ఆమె కేవలం ఓ గమ్యాన్ని చేరుకోలేదు.. కలలకు వయసు ఉండదని గుర్తుచేశారు' అని ఆ పోస్టులో పేర్కొంది. ఈ పోస్టుకు నెట్టింట విశేష స్పందన లభించింది. ఈ వయసులో కూడా బామ్మ చేసిన సాహసం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంతలా మంచు కురుస్తున్నా.. ఎముకలు కొరికే చలి ఉన్నా అక్కడికి ఎలా వెళ్లగలిగారంటూ చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.


ఉమ్లింగ్ లా పాస్ ప్రత్యేకత..

లడఖ్ ప్రాంతంలో భారత్‌-చైనా సరిహద్దుకు సమీపంలో ఉమ్లింగ్ లా పాస్ ఉంది. ఇది సముద్ర మట్టానికి సుమారు 19,024 అడుగుల ఎత్తులో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటారు మార్గంగా ఉమ్లింగ్ లా పాస్ ప్రసిద్ధి చెందింది. చిసుమ్లే, డెమ్‌చోక్ గ్రామాలను కలుపుతూ ఈ మార్గం సాగుతుంది. అయితే, ఇక్కడికి చేరుకోవడం అంత సులభం కాదు. దారి మధ్యలో తీవ్రమైన చలి, పలుచటి గాలి, తక్కువ ఆక్సిజన్ స్థాయిలు వంటి సమస్యలు ఎదురవుతాయి. సరైన ప్రణాళికతో ప్రయాణం చేయకపోతే ప్రాణాంతర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే 80 ఏళ్ల వయసులోనూ అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని సాధించిన ఈ వృద్ధురాలికి నెట్టింట నీరాజనం పడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ట్రాఫిక్ రూల్స్‌కు తూట్లు.. వీడియో వైరల్

జిమ్‌లో నీళ్లు.. ఆగని వర్కవుట్లు.. వీడియో వైరల్

Updated Date - Jul 12 , 2026 | 07:21 PM