Share News

'ఆత్మహత్య చేసుకుంటా'! ఈసీ ఖురేషీతో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్న మాటలివి!

ABN , Publish Date - Jul 12 , 2026 | 06:26 PM

భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు సంబంధించిన ఓ ఉద్వేగభరిత ఉదంతాన్ని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్.వై. ఖురేషీ తన కొత్త పుస్తకంలో రాసుకొచ్చారు. 'నువ్వు నా గురించి అలా అనుకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటా' అని మన్మోహన్ సింగ్ తీవ్ర ఆవేదనతో అన్నట్లు ఖురేషీ పేర్కొన్నారు.

'ఆత్మహత్య చేసుకుంటా'! ఈసీ ఖురేషీతో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్న మాటలివి!
SY Quraishi Recalls Manmohan Singh's Emotional Remarks

న్యూఢిల్లీ, జులై 12: నిగర్వి, మృదుస్వభావిగా పేరొందిన భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు సంబంధించిన ఓ అత్యంత ఉద్వేగభరితమైన అంతర్గత ఉదంతాన్ని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) ఎస్.వై. ఖురేషీ తన రాబోయే కొత్త పుస్తకంలో బయటపెట్టారు. 2012 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రుల ప్రవర్తనపై తాను అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడు.. 'నువ్వు నా గురించి అలా అనుకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను' అని మన్మోహన్ సింగ్ తీవ్ర ఆవేదనతో అన్నట్లు ఖురేషీ పేర్కొన్నారు.

ఖురేషీ తాజాగా రాసిన 'ఇండియా అండ్ ఐ.. ఎ హండ్రెడ్ మెమొరీస్, నాట్ ఎ మెమోయిర్' (India and I: A Hundred Memories, Not a Memoir) అనే పుస్తకంలో ఈ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ పుస్తకం జులై 16న మార్కెట్లోకి రాబోతోందని సమాచారం.


వివాదానికి కారణం ఏంటి?

2012 యూపీ ఎన్నికల ప్రచారంలో అప్పటి కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉద్యోగాల్లో కోటాను 4.5 శాతం నుంచి 9 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ (Model Code of Conduct - MCC) అమలులోకి వచ్చిన తర్వాత కొత్త పథకాలను ప్రకటించకూడదనే నిబంధనను ఇది ఉల్లంఘించడమేనంటూ బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఎన్నికల సంఘం సల్మాన్ ఖుర్షీద్‌ను తీవ్రంగా మందలించింది. కోడ్ కింద తీసుకోగల అత్యంత కఠినమైన చర్య ఇదే. దీంతో అసంతృప్తి చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు.. ఎన్నికల సంఘానికి 'అహంకారం, ఇష్టారాజ్యం' పెరిగిపోయాయంటూ పరోక్ష వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు.


ప్రధానికి చేరిన ఈసీ ఆవేదన

రాజకీయ విమర్శలను తాను పట్టించుకోనని, కానీ వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా మాట్లాడటం సహించలేనని ఖురేషీ తన పుస్తకంలో రాశారు. ఈ విషయాన్ని ఆయన అప్పటి ప్రధానమంత్రి ప్రెస్ సెక్రటరీ హరీష్ ఖారే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రధానితో మాట్లాడాలా? అని ఖారే అడగ్గా.. ఖురేషీ 'అవును' అన్నారు.

ఆందోళనతో ఫోన్ చేసిన మన్మోహన్ సింగ్:

'మరుసటి రోజే పీఎంఓ అత్యవసర ఫోన్ (RAX) మోగింది. ప్రధాని మీతో అర్జంట్‌గా మాట్లాడాలన్నారు. మన్మోహన్ సింగ్ లైన్లోకి వచ్చి.. 'ఖురేషీ జీ, నేను మిమ్మల్ని అత్యవసరంగా కలవవచ్చా?' అని చాలా ఆందోళనతో అడిగారు. ఆయన ప్రోటోకాల్ పక్కనబెట్టి నా వద్దకే వచ్చేలా మాట్లాడటంతో.. 'సార్, మీరే ప్రధానమంత్రి. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడే నేను వస్తాను' అని చెప్పి ఆ సాయంత్రం 7 గంటలకు పీఎం నివాసంలో సమావేశం ఖరారు చేసుకున్నా.' అని మాజీ సీఈసీ ఎస్.వై. ఖురేషీ తన పుస్తకంలో పేర్కొన్నారు.


'నేను ఆత్మహత్య చేసుకుంటా..' మన్మోహన్ ఉద్వేగం

సమావేశం కాగానే మన్మోహన్ సింగ్ గొంతు తీవ్ర ఆవేదనతో వణికిపోయిందని ఖురేషీ గుర్తుచేసుకున్నారు. 'నువ్వు చెప్పిన విషయాలన్నీ హరీష్ నాకు చెప్పాడు. నువ్వు కూడా నా గురించి అలాగే భావిస్తుంటే.. నేను ఆత్మహత్య చేసుకుంటాను' అని మన్మోహన్ అనడంతో ఖురేషీ నోట మాట రాలేదు.

తాను కేవలం కొందరు మంత్రుల ప్రవర్తన గురించే అన్నానని, ప్రధాని వైఖరిని ఎప్పుడూ శంకించలేదని చెప్పి ఆయనను శాంతింపజేయడానికి కొన్ని నిమిషాల సమయం పట్టింది. అప్పుడు మన్మోహన్ సింగ్ స్పందిస్తూ.. 'నాకు ఈ విషయమే తెలియదు. ఒకవేళ తెలిసి ఉంటే వారిని తీవ్రంగా మందలించేవాడిని. ఇకపై మీకు ఏ సమస్య వచ్చినా నేరుగా నాకు ఫోన్ చేయండి' అని హామీ ఇచ్చారు.

ఆ సందర్భంగా మన్మోహన్ సింగ్ అన్న మాటలను ఖురేషీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.. 'ఎన్నికల సంఘం అనేది కేవలం భారతదేశ గర్వకారణం మాత్రమే కాదు.. అది మన ప్రజాస్వామ్యానికి ఆత్మ (Soul). దాన్ని మనం కోల్పోతే, సర్వస్వం కోల్పోయినట్లే.' అని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ సందర్భంగా అన్నట్టు ఖురేషీ తన పుస్తకంలో ప్రస్తావించారు.


పవర్ వెయిట్‌ను ముందే తెల్సుకున్న నేత

ఈ సమావేశం జరిగిన తర్వాత ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నేతల పరోక్ష విమర్శలు పూర్తిగా ఆగిపోయాయని ఖురేషీ తెలిపారు. 'నా జీవితంలో ఎంతోమంది శక్తిమంతమైన వ్యక్తులను చూశా. కానీ అధికారాన్ని ఇంత తేలికగా ప్రదర్శిస్తూ.. దాని బాధ్యతను (Weight) ఇంత లోతుగా అనుభవించిన వారు చాలా అరుదు. రాజకీయాల్లో మొండిగా ఉండే గుణం అవసరమనే భావన ఉన్న చోట.. మన్మోహన్ సింగ్ తన అరుదైన సున్నితత్వంతో ప్రత్యేకంగా నిలిచారు' అని ఖురేషీ కొనియాడారు.

SYKhuraishi-new-book.jpg


Also Read:

ఫిరంగి కోసం పోరాటం

వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు

Updated Date - Jul 12 , 2026 | 07:05 PM