నా వంట నేనే చేసుకుంటా.. తిహాడ్ జైల్లోని అమెరికన్ ఖైదీ పిటిషన్
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:53 PM
జైల్లో పెట్టే భోజనాన్ని తినలేకపోతున్నానంటూ తిహాడ్ జైల్లోని అమెరికన్ ఖైదీ మాథ్యూ ఆరన్ వాన్‌డైక్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జైల్లోనే తాను స్వయంగా వంట చేసుకునేందుకు మానవతా దృక్పథంతో అనుమతించాలని అభ్యర్థించాడు.
ఇంటర్నెట్ డెస్క్: జైల్లో పెట్టే భోజనాన్ని తినలేకపోతున్నానంటూ తిహాడ్ జైల్లోని అమెరికన్ ఖైదీ మాథ్యూ ఆరన్ వాన్‌డైక్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జైల్లోనే తాను స్వయంగా వంట చేసుకునేందుకు మానవతా దృక్పథంతో అనుమతించాలని అభ్యర్థించాడు. జైలు భోజనంలో మసాలా, కారం, నూనె ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఆ కూడు తినలేక 50 రోజులుగా పస్తులు ఉంటున్నానని చెప్పాడు. తను స్వయంగా వంట చేసుకునేందుకు కావాల్సిన సరకులు, వంటపాత్రలు అందుబాటులో ఉంచాలని అభ్యర్థించాడు. ఇందుకు అయ్యే ఖర్చు తానే భరిస్తానని కూడా తెలిపాడు. ఈ మేరకు పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన అభియోగంపై వాన్‌డైక్‌ను ఎన్ఐఏ మార్చిలో అరెస్టు చేసింది. ఏప్రిల్ 14 నుంచి అతడు తిహాడ్ జైల్లో ఖైదీగా ఉంటున్నాడు. అయితే, జైలు భోజనం తినడం తన వల్ల కావట్లేదని వాన్‌డైన్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఒక అమెరికన్‌గా తనకు భారతీయ ఆహారం అలవాటు లేదని అన్నాడు. ఫలితంగా జైల్లో ఇచ్చే అహారంతో తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నట్టు చెప్పాడు. 14 కేజీల బరువు తగ్గానని, పోషకాహారం లేకపోవడంతో కంటిచూపు కూడా తగ్గిందని అన్నాడు. శారీరక దారుఢ్యం, రోగ నిరోధక శక్తి సన్నగిల్లాయని చెప్పాడు.
ఈ సమస్యకు పరిష్కారంగా జైల్లో తన వంట తానే చేసుకోవడానికి అనుమతించాలని కోర్టును అభ్యర్థించాడు. పప్పు, రెడ్ మీట్, చికెన్, చేపలు, పాస్తా, నూడుల్స్, బియ్యం, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, బ్రెడ్, బటర్ వంటివి అందుబాటులో ఉంచేలా జైలు అధికారులను ఆదేశించాలని అభ్యర్థించాడు. ఆలివ్ ఆయిల్, టోన్డ్ మిల్క్ కావాలని కోరాడు. ఇండక్షన్ కుక్కర్, ఇతర వంట పాత్రలు ఇవ్వాలని పేర్కొన్నాడు. ఇక మాథ్యూ పిటిషన్‌పై స్పందించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జులై 21కి వాయిదా వేసింది.
మాథ్యూతో పాటు మరో ఆరుగురు ఉక్రెయిన్ వ్యక్తులను ఎన్ఐఏ మార్చి 13న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో అరెస్టు చేసింది. నిషేధిత చొరబాటుదారులతో వీరికి సంబంధాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. వారికి ఆయుధాలు, పరికరాలు సప్లై చేస్తున్నారని చెప్పారు. టూరిస్టు వీసాపై వచ్చిన నిందితులు తొలుత అస్సాం మీదుగా మిజోరం రాష్ట్రానికి వెళ్లారని ఎన్ఐఏ పేర్కొంది. ఆ తరువాత అక్రమంగా మయాన్మార్‌లోకి ప్రవేశించారని తెలిపింది. అక్కడి నిషేధిత మిలిటెంట్ సంస్థలకు శిక్షణ ఇచ్చారని పేర్కొంది. ఉపా చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
మద్రాస్ హైకోర్టులో విజయ్ ప్రభుత్వానికి భారీ ఊరట!
భారత్‌లో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ప్రొడక్షన్ లైన్!