ఈ అభిరుచులను ప్రయత్నించండి...
ABN , Publish Date - May 03 , 2026 | 09:36 AM
ఒక్కొక్కరికీ ఒక్కో అభిరుచి ఉంటుంది. అభిరుచులే వారిని అందరిలో ప్రత్యేకంగా నిలుపుతాయి. రొటీన్ వాటిని కాసేపు పక్కన పెడితే... ఇలాంటి హాబీలు కూడా ఉంటాయా? అని ఆశ్చరపరిచేవి కూడా ఉన్నాయి.
ఒక్కొక్కరికీ ఒక్కో అభిరుచి ఉంటుంది. అభిరుచులే వారిని అందరిలో ప్రత్యేకంగా నిలుపుతాయి. రొటీన్ వాటిని కాసేపు పక్కన పెడితే... ఇలాంటి హాబీలు కూడా ఉంటాయా? అని ఆశ్చరపరిచేవి కూడా ఉన్నాయి. అలాంటి కొన్ని వెరైటీ హాబీలివి. ప్రయత్నిస్తే పోయేదేం ఉంది...
చుక్కలు లెక్కపెడతారు...
చుక్కలు లెక్కబెట్టడం కూడా ఒక హాబీనా? అంటే అవుననే చెప్పాలి. దీనిని ‘స్టార్ గేజింగ్’ అంటారు. అంటే ఆకాశంలో చుక్కలను మాత్రమే చూడటం కాదు... విశ్వం అనంతం. ఎంత శోధించినా తరగదు. ఒకసారి నెట్‌లో ఆకాశం గురించి వెదికితే... చుక్కల్లో వెదికేందుకు ఎన్ని ఉన్నాయో అర్థమవుతుంది. నక్షత్రరాశులను గుర్తించడం, చంద్రుడిని పరిశీలించడం, గ్రహాలను చూడటం... వంటివి ఎన్నో ఉంటాయి. ఒక్కసారి ఆసక్తి పెరిగితే ఈ హాబీని వదలరు. స్టార్‌గేజింగ్‌కు టెలీస్కోప్ అవసరం లేదు. నగరానికి దూరంగా కాంతి కాలుష్యం లేని చోటుకు వెళితే సరిపోతుంది. నక్షత్రాలను, శాటిలైట్‌లను మరింత దగ్గరగా చూడాలనుకుంటే బడ్జెట్‌లో టెలీస్కోప్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ హాబీ ఒత్తిడిని దూరం చేస్తుంది. ప్రకృతితో అనుబంధం పెరుగుతుంది. ఈ అభిరుచిని ఎంచుకున్న వారిని ‘స్టార్ గేజర్స్’ అంటారు.

డ్రోన్‌లకూ రేసులున్నాయి...
పరుగు పందెం నేలపైన కాదు.... ఆకాశంలో! అలా అని విమానాలు నడపడం కాదు. నేలపై నుంచే ఆకాశంలో డ్రోన్లను పరుగెత్తించాలి. ఎవరి డ్రోన్ వేగంగా పరుగెత్తి గమ్యాన్ని చేరితే వారే విజేత. రాను రాను ఈ పందెం కోట్ల విలువ చేసే క్రీడగా మారుతోంది. డ్రోన్లను ఇష్టపడేవారు ఈ హాబీ గురించి ఆలోచించొచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ‘డ్రోన్ రేసింగ్ కాంపిటీషన్’లను నిర్వహిస్తున్నారు. మన దగ్గర కూడా డ్రోన్ రేసింగ్ లీగ్‌లను నిర్వహిస్తున్నారు. ఔత్సాహికులు ఆయా వెబ్‌సైట్లలో వివరాలు తెలుసుకుని ఈ రేసింగ్ పోటీల్లో పాల్గొనవచ్చు. ప్రతీ సీజన్‌లో డ్రోన్ పైలెట్లు ఛాంపియన్‌షిప్ గెలవడానికి పోటీపడతారు. దీన్ని హాబీగా ఎంచుకుంటే డ్రోన్ రేసింగ్ లీగ్స్‌లో పాల్గొనవచ్చు. వినోదంతో పాటు సరికొత్త థ్రిల్ లభిస్తుంది.
జియో క్యాచింగ్
ఇది మోడ్రన్ డే ట్రెజర్‌హంట్ అని చెప్పుకోవచ్చు. సాంకేతికత, సాహసం, ప్రకృతితో కలిసి సాగే అభిరుచి ఇది. ఈ మధ్యకాలంలో పాపులర్ అవుతున్న హాబీ. ఒక గ్రూపుగా ఏర్పడి ఈ ఆట ఆడతారు. అందరి ఫోన్లలో ‘జియా క్యాచింగ్ యాప్’ ఇన్‌స్టాల్ చేసుకుంటారు. ముందుగా ఒక పెట్టెను దాచిపెడతారు. గ్రూప్ సభ్యులు ఆ పెట్టెను కనిపెట్టాల్సి ఉంటుంది. పెట్టెను చేరుకోవడానికి స్మార్ట్‌ఫోన్‌లోని యాప్ మార్గనిర్దేశం చేస్తుంది. జీపీఎస్ డైరెక్షన్స్‌తో ఆ పెట్టెను చేరుకోవాలి. పెట్టెను కనుగొన్నవారు వారి వివరాలు లాగ్ బుక్‌లో నమోదు చేయాలి. బోలెడంత ఫన్‌ను క్రియేట్ చేసే హాబీ ఇది. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో ‘జియో క్యాచింగ్’ పాపులర్ యాక్టివిటీగా మారింది.
బంతిలో దొర్లుతూ...
న్యూజీలాండ్‌లో పుట్టిన ఫన్, థ్రిల్లింగ్ యాక్టివిటీ ఇది. అడ్వెంచర్ స్పోర్ట్‌గా చెప్పుకోవచ్చు. ఒక పెద్ద గాలి నింపిన ట్రాన్స్‌పరెంట్ ప్లాస్టిక్ బాల్‌లో నిలుచుని దొర్లించుకుంటూ వెళ్లే ఆట ఇది. ఈ హాబీకి ఒకసారి అలవాటైతే, టీమ్‌లో చేరిపోయి కాంపిటీషన్స్‌లో పాల్గొంటారు. మనాలీలోని సోలంగ్ వ్యాలీ, హిమాచల్ ప్రదేశ్‌లోని ఖజ్జార్, లోనావాలా లోని డెల్లా అడ్వెంచర్ పార్క్, గోవా, రిషికేష్, కర్ణాటకలోని దండేలి, కశ్మీర్‌లోని పహల్గాంలో ఈ సాహసక్రీడ అందుబాటులో ఉంది. మూడు రకాల జోర్బింగ్ ఉంటుంది. నేల, నీరు, మంచు... ఈ మూడింటిలోనూ జోర్బింగ్ చేయొచ్చు. కాస్త భిన్నంగా ఉండాలని కోరుకునేవారు ఎంచుకోదగిన హాబీ ఇది.
అగ్నిపర్వతంపై ఆట...
ఇలాంటి హాబీ గురించి ఇంతకుముందు విని ఉండరు. సాహసప్రియులు బాగా ఆనందించే అవుట్‌డోర్ యాక్టివిటీ ఇది. అగ్నిపర్వతం వాలుపై సర్ఫింగ్ చేయడం మంచి కిక్‌నిస్తుంది. ఇది మంచుపర్వతాలలో చేసే స్నోబోర్డింగ్‌ను తలపిస్తుంది. అయితే ప్రమాదం వెన్నంటే ఉంటుంది. పడిపోతే రాళ్లకు తగిలి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. తగిన రక్షణ చర్యలు లేకుండా ఈ సర్ఫింగ్ చేయడం సరైనది కాదు. హెల్మెట్, జంప్‌సూట్స్, గాగుల్స్ వంటివి తప్పక ధరించాలి. యాక్టివ్‌గా లేని అగ్నిపర్వతాల చెంత మాత్రమే సర్ఫింగ్ చేయాలి. విదేశాలలో చాలామంది వోల్కనో సర్ఫింగ్‌కు సై అంటున్నారు. హాబీ కొత్తగా ఉండాలని కోరుకునేవారికి బెస్ట్ ఆప్షన్ ఇది. అయితే మన దేశంలో అందుబాటులో లేదు.

వేలాడే గుడారాల్లో...
కొండ అంచుల్లో గుడారాన్ని వేలాడదీసుకుని అందులో బస చేయడం మరిచిపోలేని అను భూతి! హైట్స్ అంటే భయం లేదనేవారు ఎం చుకోదగిన హాబీ. ఈ హాబీ సాహసోపేతంగా ఉంటుంది. అయితే ఒక్కరే సొంతంగా చేయ డానికి ఉండదు. గ్రూప్‌గా వెళ్లాల్సి ఉంటుంది. నిపుణులైన సిబ్బంది తోడుగా ఉంటారు.
గత కొన్నేళ్లుగా ‘క్లిఫ్ క్యాంపింగ్’ బాగా పాపులర్ అవుతోంది. మహారాష్ట్రలోని సందన్‌వ్యాలీ, హిమాచల్‌ప్రదేశ్‌లోని బారట్ వ్యాలీ, కేరళలోని మున్నార్, మహారాష్ట్రలోని వెస్ట్రన్ ఘాట్స్‌లో క్లిఫ్ క్యాంపింగ్ అందుబాటులో ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News