సికింద్రాబాద్ నుంచి జ్యోతిర్లింగ యాత్ర.. ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్
ABN , Publish Date - May 20 , 2026 | 10:44 AM
సప్త జ్యోతిర్లింగాల దర్శనం కోసం భక్తులకు ప్రత్యేక అవకాశం కల్పిస్తూ IRCTC కొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ భారత్ గౌరవ్ టూరిస్టు రైలులో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాలను 11 రోజుల యాత్రలో దర్శించుకునే అవకాశం ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: భక్తులకు ఆధ్యాత్మిక యాత్రను మరింత సౌకర్యవంతంగా అందించేందుకు IRCTC ‘సప్త జ్యోతిర్లింగ్ దర్శన్ యాత్ర’ పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ యాత్రలో మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్ ఆలయాలతో పాటు గుజరాత్‌లోని ద్వారక, సోమనాథ్, మహారాష్ట్రలోని భీమశంకర్, త్రయంబకేశ్వర్, ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది. మొత్తం 10 రాత్రులు, 11 రోజుల పాటు సాగే ఈ యాత్ర జూన్ 16న సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్టు రైలుతో ప్రారంభమవుతుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ జంక్షన్‌లలో ఈ రైలును ఎక్కవచ్చు.
యాత్రలో దర్శించుకునే ప్రముఖ క్షేత్రాలు
యాత్రలో భాగంగా మొదట ఉజ్జయినిలో మహాకాళేశ్వర్ ఆలయ దర్శనం ఉంటుంది. అనంతరం ఓంకారేశ్వర్, ద్వారకాధీశ్ ఆలయం, నాగేశ్వర్ జ్యోతిర్లింగం, సోమనాథ్ ఆలయం, భీమశంకర్, త్రయంబకేశ్వర్, ఘృష్ణేశ్వర ఆలయాలను వరుసగా సందర్శించేలా ప్రణాళిక రూపొందించారు. యాత్రికులకు హోటల్ బస, శాకాహార భోజనం, స్థానిక రవాణా, ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ మేనేజర్ సహాయం వంటి సదుపాయాలు ప్యాకేజీలో భాగంగా అందుబాటులో ఉంటాయి.
ప్యాకేజీ వివరాలు
ఈ ప్యాకేజీలో ఎకానమీ, స్టాండర్డ్, కంఫర్ట్ అనే మూడు కేటగిరీలు ఉన్నాయి. స్లీపర్ క్లాస్‌లో ఎకానమీ టికెట్ ధర రూ.17,600 నుంచి ప్రారంభమవుతుంది. 3ఏసీ స్టాండర్డ్ ప్యాకేజీ ధర రూ.26,700 కాగా, 2ఏసీ కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.34,600గా నిర్ణయించారు. చిన్నారులకు ప్రత్యేక రాయితీ ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి.
భీమశంకర్ ఆలయంలో ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్నందున దర్శనాలపై పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని ఐఆర్‌సీటీసీ తెలిపింది. ఆలయం అందుబాటులో లేకపోతే పుణెలోని ఇతర ఆలయాలను సందర్శించే అవకాశం కల్పించనున్నారు. యాత్ర చివరగా ఛత్రపతి శంభాజీనగర్ నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభమై 11వ రోజు ఉదయం సికింద్రాబాద్‌కు చేరుకోవడంతో ముగుస్తుంది. మరిన్ని వివరాలు, బుకింగ్ కోసం IRCTC వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
సిగరెట్లు తాగకపోయినా పెదాలు నల్లగా ఉన్నాయా? ఈ చిట్కాలు ట్రై చేయండి
రాగి బాటిల్‌లో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు మాత్రం చేయొద్దు