విమాన ప్రయాణంలో చెవి నొప్పి తగ్గించే చిట్కాలు ఇవే
ABN , Publish Date - May 19 , 2026 | 01:28 PM
విమాన ప్రయాణాల్లో టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో చాలామందికి చెవి నొప్పి రావడం సాధారణ సమస్యగా మారింది. అయితే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే ఈ సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో విమాన ప్రయాణాలు చాలా సాధారణమయ్యాయి. అయితే విమానం టేకాఫ్ అవుతున్నప్పుడు లేదా ల్యాండింగ్ సమయంలో చాలామందికి చెవులు మూసుకుపోయినట్లు అనిపించడం, చెవి నొప్పి రావడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. కొందరికి చెవుల్లో ఒత్తిడి పెరిగినట్లు అనిపించగా, మరికొందరికి తాత్కాలికంగా వినికిడి తగ్గినట్లు కూడా అనిపిస్తుంది.
అయితే, విమానంలో గాలి పీడనం ఒక్కసారిగా మారడం వల్ల ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మన చెవుల్లో ‘యుస్టాచియన్ ట్యూబ్’ అనే చిన్న గొట్టం ఉంటుంది. ఇది చెవి లోపల, బయట గాలి పీడనాన్ని సమతుల్యం చేస్తుంది. కానీ విమానం వేగంగా పైకి ఎగిరినప్పుడు లేదా కిందికి దిగినప్పుడు గాలి పీడనం త్వరగా మారిపోతుంది. ఈ మార్పునకు యూస్టాకియన్ ట్యూబ్ వెంటనే స్పందించలేకపోతే చెవుల్లో ఒత్తిడి పెరిగి నొప్పి, దిబ్బడ వంటి సమస్యలు వస్తాయి. జలుబు, అలర్జీలు, సైనస్ సమస్యలు లేదా చెవి సంబంధిత ఇబ్బందులు ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నపిల్లల్లో కూడా ఇది సాధారణమే.
విమాన ప్రయాణంలో చెవి నొప్పిని తగ్గించే చిట్కాలు:
టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో చూయింగ్ గమ్ నమలడం మంచిది.
క్యాండీ తినడం లేదా తరచుగా నీళ్లు తాగడం ఉపయోగపడుతుంది.
ఆవలింతలు చెవుల్లోని ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.
తరచుగా మింగడం వల్ల యుస్టాచియన్ ట్యూబ్ తెరుచుకుని గాలి పీడనం సమతుల్యం అవుతుంది.
చాలా సందర్భాల్లో ఈ సమస్య కొంతసేపటికి తగ్గిపోతుంది. కానీ నొప్పి ఎక్కువసేపు కొనసాగితే మాత్రం వైద్యులని సంప్రదించడం మంచిది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
సిగరెట్లు తాగకపోయినా పెదాలు నల్లగా ఉన్నాయా? ఈ చిట్కాలు ట్రై చేయండి
రాగి బాటిల్‌లో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు మాత్రం చేయొద్దు