Share News

అత్యవసర ప్రయాణం.. టికెట్ లేకున్నా ట్రైన్‌లో వెళ్లొచ్చా?

ABN , Publish Date - May 24 , 2026 | 07:05 PM

సాధారణంగా టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేయడం నిబంధనలకు విరుద్ధం. అయితే అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా భారతీయ రైల్వే కొన్ని ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తోంది.

అత్యవసర ప్రయాణం.. టికెట్ లేకున్నా ట్రైన్‌లో వెళ్లొచ్చా?
Indian Railways Ticket Rules

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా రైలులో టికెట్ లేకుండా ప్రయాణించడం నిబంధనలకు విరుద్ధం. అలాంటి సందర్భాల్లో జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా భారతీయ రైల్వే కొన్ని ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తోంది. టికెట్ తీసుకునే సమయం లేకపోయినా కొన్ని షరతులతో ప్రయాణానికి అనుమతి లభించవచ్చు.


రైల్వే రూల్స్ ప్రకారం, ప్రయాణికుడి వద్ద కనీసం ప్లాట్‌ఫాం టికెట్ ఉండాలి. ఈ టికెట్ ద్వారా ప్రయాణికుడు ఏ స్టేషన్ నుంచి ప్రయాణం ప్రారంభించాడో గుర్తించడానికి అవకాశం ఉంటుంది. రైలులో ఎక్కిన తర్వాత వెంటనే టీటీఈని సంప్రదించి పూర్తి వివరాలు చెప్పాలి. ఆ తర్వాత ప్రయాణికుడు వెళ్లాల్సిన గమ్యస్థానం వరకు టికెట్ ఛార్జీని టీటీఈ ద్వారా చెల్లించాలి. చెల్లింపు అనంతరం టీటీఈ అధికారిక రసీదు జారీ చేస్తారు. ఇది మీ ప్రయాణాన్ని చెల్లుబాటు అయ్యేలా చేస్తుంది.


అయితే ఈ విధానం ద్వారా ప్రయాణం చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ రిజర్వేషన్ సీటు ఖచ్చితంగా వస్తుందనే హామీ ఉండదు. ఖాళీ సీట్లు ఉంటే మాత్రమే టీటీఈ సీటు కేటాయించే అవకాశం ఉంటుంది. లేదంటే జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించాల్సి రావచ్చు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న విషయాన్ని టీటీఈకి తెలియజేయకుండా తనిఖీల్లో పట్టుబడితే జరిమానా విధించే అవకాశం ఉంటుంది. సాధారణంగా జరిమానాతో పాటు ప్రయాణ ఛార్జీ కూడా వసూలు చేస్తారు. సాధ్యమైనంత వరకు ముందుగానే ఐఆర్‌సీటీసీ యాప్ లేదా రైల్వే కౌంటర్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవడం ఉత్తమమని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.


Also Read:

రాష్ట్రంలో ఎబోలా అలర్ట్.. అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం

జయశంకర్ భూపాలపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎల్ అండ్ టీ క్యాంప్ కార్యాలయం దగ్ధం!

Updated Date - May 24 , 2026 | 07:08 PM