Share News

భారతీయులకు షాక్ ఇచ్చిన థాయ్‌లాండ్.. 60 డే వీసా ఫ్రీ స్కీమ్ రద్దు

ABN , Publish Date - May 22 , 2026 | 06:26 PM

వీసా రూల్స్‌లో థాయ్‌లాండ్ ప్రభుత్వం పెను మార్పులు చేసింది. 60 రోజుల ఉచిత వీసా స్కీమ్‌ను పూర్తిగా రద్దు చేసింది.

భారతీయులకు షాక్ ఇచ్చిన థాయ్‌లాండ్.. 60 డే వీసా ఫ్రీ స్కీమ్ రద్దు
Thailand visa update

ఇంటర్‌నెట్ డెస్: వీసా రూల్స్‌లో థాయ్‌లాండ్ ప్రభుత్వం పెను మార్పులు చేసింది. 60 రోజుల ఉచిత వీసా స్కీమ్‌ను పూర్తిగా రద్దు చేసింది. థాయిలాండ్ ప్రభుత్వం 2024 జులై నెలలో భారతదేశంతో సహా 93 దేశాలకు 60 రోజుల ఉచిత వీసా స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీమ్‌లో భాగంగా 93 దేశాల పర్యాటకులు వీసా లేకుండా థాయ్‌లాండ్‌కు వచ్చి 60 రోజుల పాటు ఉండటానికి వీలుండేది. వీసా దుర్వినియోగం కావడం.. కొందరు అక్రమ వ్యాపారాలు చేస్తుండటం.. నేరాలకు పాల్పడుతుండటంతో భద్రతా కారణాల దృష్ట్యా అక్కడి ప్రభుత్వం ఎంట్రీ రూల్స్‌లో మార్పులు చేసింది.


60 రోజుల ఉచిత వీసా స్కీమ్‌ స్థానంలో వీసా ఆన్ అరైవల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, భారత్‌‌తో సహా కేవలం నాలుగు దేశాలకు మాత్రమే వీసా ఆన్ అరైవల్‌ స్కీమ్‌ను థాయ్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇండియాతో పాటు అజర్‌బైజాన్, బెలారస్, సెర్బియా దేశాలకు చెందిన పర్యాటకులు థాయ్‌లాండ్ వెళ్లిన తర్వాత వీసా తీసుకోవచ్చు.


కొత్త వీసా కేటగిరీలు ఇవీ..

  • 15 రోజుల వీసా మినహాయింపు (Phor 15):

ఈ కేటగిరీ కింద సీషెల్స్, మాల్దీవులు, మారిషస్ దేశాల పర్యాటకులు వీసా లేకుండా 15 రోజుల పాటు దేశంలో ఉండొచ్చు.

  • 90 రోజుల పరస్పర వీసా మినహాయింపు (Phor Phor 90):

రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాల వల్ల అర్జెంటీనా, పెరూ, చిలీ, బ్రెజిల్, దక్షిణ కొరియా దేశాలకు చెందిన పర్యాటకులు 90 రోజుల పాటు వీసా లేకుండా థాయిలాండ్‌లో ఉండొచ్చు.

  • 30 రోజుల పరస్పర వీసా మినహాయింపు (Phor Phor 30):

చైనా, హాంగ్‌కాంగ్, రష్యా, లావోస్, మకావు, తైమూర్-లెస్టే, కజకిస్తాన్ దేశాలకు చెందిన పర్యాటకులు వీసా లేకుండా 30 రోజుల పాటు దేశంలో ఉండొచ్చు.

  • 14 రోజుల పరస్పర వీసా మినహాయింపు (Phor Phor 14):

కాంబోడియా, మయన్మార్ దేశాలకు చెందిన పర్యాటకులు 14 రోజుల పాటు వీసా లేకుండా దేశంలో ఉండొచ్చు.

  • 30 రోజుల వీసా మినహాయింపు (Phor 30):

ఈ కేటగిరీ కింద మొత్తం 54 దేశాల ప్రజలు ఎలాంటి వీసా లేకుండా థాయిలాండ్‌లో 30 రోజుల పాటు పర్యటించవచ్చు.


ఇవి కూడా చదవండి

ఏపీ అటవీ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష..

రాష్ట్రపతి ఎన్నికలు, డీలిమిటేషన్ బిల్లే టార్గెట్.. డీఎంకే 22 మంది ఎంపీలపై బీజేపీ కన్ను!

Updated Date - May 22 , 2026 | 09:47 PM