Share News

ఏపీ అటవీ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష..

ABN , Publish Date - May 22 , 2026 | 05:57 PM

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్ నెలలో నిర్వహించనున్న విత్తన బంతుల తయారీ కార్యక్రమంపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

ఏపీ అటవీ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష..
Deputy CM Pawan Kalyan

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్ నెలలో నిర్వహించనున్న విత్తన బంతుల (సీడ్ బాల్స్) తయారీ కార్యక్రమంపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో 2.5 కోట్ల విత్తన బంతులను పంపిణీ చేయాలని అధికారులను పవన్ ఆదేశించారు. వీటి తయారీ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని అన్నారు. అందుకు అన్ని వర్గాల ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సూచించారు.


ఈ ఏడాది వర్షాకాల సీజన్‌ను పూర్తిగా వినియోగించుకోవాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. జులై, ఆగస్టు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా విత్తన బంతులను విస్తారంగా చల్లడానికి అటవీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. ఇందుకోసం మూడు రకాల ప్రత్యేక పద్ధతులను ఉపయోగించాలని సూచించారు. నేరుగా చల్లడం, అత్యాధునిక డ్రోన్ సాంకేతికతను వినియోగించడం, చేతులతో నాటడం చేయాలని ఆయన పేర్కొన్నారు. అడవుల్లో జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం, స్వచ్ఛమైన, పచ్చని ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడం ఈ హరిత ఉద్యమ ప్రధాన లక్ష్యమని పవన్ చెప్పుకొచ్చారు.


మనం చల్లే ప్రతి విత్తన బంతి.. మన భవిష్యత్తుకు ఇచ్చే ఒక నమ్మకమైన హామీగా మారాలని ఉప ముఖ్యమంత్రి అన్నారు. రాబోయే తరాల కోసం ఆంధ్రప్రదేశ్‌ను మరింత పచ్చగా, ఆరోగ్యకరంగా, సుస్థిరంగా మార్చేందుకు మనమంతా చేతులు కలపాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

పెన్షన్లపై జగన్‌ అబద్ధపు ప్రచారాలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అనంతపురం జిల్లాలో గోల్డ్ మైన్స్‌ గుర్తింపు: మంత్రి కొల్లు రవీంద్ర

Updated Date - May 22 , 2026 | 06:00 PM