Share News

ఆయిల్ సప్లైకి తీవ్ర ఆటంకం.. ‘రెడ్ జోన్’ హెచ్చరికలు జారీ చేసిన ఐఈఏ

ABN , Publish Date - May 22 , 2026 | 05:21 PM

అమెరికా-ఇరాన్ యుద్ధం, హోర్ముజ్ జలసంధి మూత పడటం కారణంగా ప్రపంచ మార్కెట్‌లో ప్రతీరోజూ 13 నుంచి 14 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ సప్లై నిలిచిపోయిందని ఇంటర్ నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ ఫాతిహ్ బిరోల్ తెలిపారు.

ఆయిల్ సప్లైకి తీవ్ర ఆటంకం.. ‘రెడ్ జోన్’ హెచ్చరికలు జారీ చేసిన ఐఈఏ
Strait of Hormuz news

న్యూఢిల్లీ, మే 22: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్, గ్యాస్ కొరత ఏర్పడ్డ సంగతి తెలిసిందే. రోజు రోజుకు సమస్య తీవ్రతరం అవుతోంది. యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఆయిల్, గ్యాస్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. అంతేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా 20 శాతం నౌకలు ఆయిల్, గ్యాస్ రవాణా చేసే హోర్ముజ్ జలసంధి కూడా మూతపడింది. అమెరికా-ఇరాన్ యుద్ధం, హోర్ముజ్ జలసంధి మూత పడటం కారణంగా ప్రపంచ మార్కెట్‌లో ప్రతీరోజూ 13 నుంచి 14 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ సప్లై నిలిచిపోయిందని ఇంటర్ నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ ఫాతిహ్ బిరోల్ తెలిపారు.


హోర్ముజ్‌ను మళ్లీ తెరవకపోవటం.. నౌకలు ప్రయాణించడానికి ప్రత్యామ్నాయ దారులు లేకపోవటంతో సప్లై మరింత దారుణంగా పడిపోయిందని బిరోల్ అన్నారు. సప్లై నిలిచిపోవటం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి నెలలో ఐఈఏ, 32 సభ్య దేశాలు కలిసి మార్కెట్లోకి విడుదల చేసిన రికార్డు స్థాయి 400 మిలియన్ బ్యారెళ్ల అత్యవసర చమురు నిల్వలు కూడా పూర్తిగా హరించుకుపోయాయని ఆయన పేర్కొన్నారు.


‘రెడ్ జోన్’ హెచ్చరికలు..

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ ఆయిల్ మార్కెట్ త్వరలో తీవ్ర ప్రమాదకరమైన ‘రెడ్ జోన్’లోకి ప్రవేశిస్తుందని ఇంటర్‌నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ ఫాతిహ్ బిరోల్ హెచ్చరించారు. హోర్ముజ్ జలసంధి మూసివేత భయాలు, వేసవి కాలంలో పెరగనున్న డిమాండ్ కారణంగా క్రూడ్ ఆయిల్ సప్లై స్తంభించి.. ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ఆయిల్ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని అన్నారు.


ఇవి కూడా చదవండి

సీఎస్కే వైఫల్యానికి అసలు కారణం ఇదే: సెహ్వాగ్

నిమ్స్‌లో 2000 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్‌.. వైద్య బృందానికి సీఎం రేవంత్ అభినందనలు

Updated Date - May 22 , 2026 | 05:25 PM