Share News

అనంతపురం జిల్లాలో గోల్డ్ మైన్స్‌ గుర్తింపు: మంత్రి కొల్లు రవీంద్ర

ABN , Publish Date - May 22 , 2026 | 03:48 PM

అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో గోల్డ్ మైన్స్‌ను గుర్తించినట్లు మంత్రి కొల్లురవీంద్ర తెలిపారు. బీచ్ శాండ్ ద్వారా ఖనిజ సంపదను గుర్తించడం జరిగిందన్నారు.

అనంతపురం జిల్లాలో గోల్డ్ మైన్స్‌ గుర్తింపు: మంత్రి కొల్లు రవీంద్ర
Minister Kollu Ravindra

కర్నూలు, మే 22: గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి పెట్టుబడి పెట్టాలంటే ఎవరు రాలేని పరిస్థితి ఉండేదని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు పోటీపడి ముందుకు వస్తున్నారన్నారు. ఈరోజు(శుక్రవారం) తుగ్గలి మండలం జొన్నగిరిలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే మైనింగ్ శాఖలో రూ. 4 వేల కోట్లు అధికంగా రాబడి వచ్చిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు పరిపాలన విధానాన్ని చూసి భారత దేశంలో వచ్చిన పెట్టుబడులలో 25% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయని అన్నారు.


జొన్నగిరిలో జియో మైసూర్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థ.. బంగారు శుద్ధి, ఉత్పత్తికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్ర సామాగ్రిని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఒకటన్ను ముడి సరుకు నుంచి ఒక గ్రాము బంగారం వస్తుందన్నారు. ప్రస్తుతం 300 మీటర్ల వరకు తవ్వారని... భవిష్యత్తులో రెండు కిలోమీటర్ల వరకు తవ్వకాలు జరుపనున్నట్లు చెప్పారు. దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు ఇది అని అన్నారు. అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో కూడా గోల్డ్ మైన్స్‌ను గుర్తించినట్లు తెలిపారు. బీచ్ శాండ్ ద్వారా ఖనిజ సంపదను గుర్తించడం జరిగిందన్నారు.


గ్రానైట్, క్వార్ట్జ్‌కు బాగా డిమాండ్ ఉందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో మైనింగ్ దోపిడీ జరిపి జేబులు నింపుకున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. జియో మైసూర్ గోల్డ్ మైనింగ్ పరిశ్రమను వచ్చే నెల 27న సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవం చేస్తారని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ వెల్లడించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

అభినయ్ దర్శన్ వ్యవహారంపై హోం మంత్రి అనిత స్పందన

పెన్షన్లపై జగన్‌ అబద్ధపు ప్రచారాలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Read Latest AP News And Telugu News

Updated Date - May 22 , 2026 | 04:27 PM