Share News

రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - May 22 , 2026 | 03:10 PM

దేశంలో రిజర్వేషన్ల ఫలాలు అందుకొని సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలు.. తరతరాలుగా అదే కోటాను కోరుకోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులై, ప్రభుత్వ సర్వీసుల్లో ఉంటూ పూర్తి స్థాయిలో స్థిరపడినప్పుడు, ఇక వారి పిల్లలకు రిజర్వేషన్ల కోటా ఎందుకని ప్రశ్నించింది.

రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
Why IAS Officers' Children Seek Quota? Supreme Court Raises Big Question on Reservation

న్యూఢిల్లీ, మే 22: దేశంలో రిజర్వేషన్ల ఫలాలు అందుకొని సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలు.. తరతరాలుగా అదే కోటాను కోరుకోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 'తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులై, ప్రభుత్వ సర్వీసుల్లో ఉంటూ పూర్తి స్థాయిలో స్థిరపడినప్పుడు, ఇక వారి పిల్లలకు రిజర్వేషన్ల కోటా ఎందుకు?' అని అత్యున్నత న్యాయస్థానం సంచలన ప్రశ్నలు సంధించింది.

వెనుకబడిన వర్గాల్లోని 'క్రీమీలేయర్' (ధనిక, ఉన్నత శ్రేణి) పరిమితులు, రిజర్వేషన్ల మినహాయింపులపై దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ (శుక్రవారం) ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

తరతరాల కోటాతో వ్యవస్థ నుంచి బయటపడలేం!

విచారణ సందర్భంగా జస్టిస్ బి.వి. నాగరత్న మాట్లాడుతూ.. విద్య, ఆర్థిక సాధికారత ద్వారా సమాజంలో ఒక స్థాయి (Social Mobility) లభిస్తుందని పేర్కొన్నారు. 'రిజర్వేషన్ల ద్వారా ఒకసారి ఉన్నత స్థాయికి చేరుకున్నాక కూడా, మళ్లీ వారి పిల్లల కోసం కోటాను ఆశించడం సరికాదు. ఇలాగైతే మనం రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి ఎప్పటికీ బయటపడలేం. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉంది' అని వ్యాఖ్యానించారు.

ఒక వ్యక్తి సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉండవచ్చని.. కానీ, రిజర్వేషన్ల ప్రయోజనం పొంది తల్లిదండ్రులు ఉన్నత స్థానాలకు వెళ్లినప్పుడు వారి పిల్లల పరిస్థితి మారుతుందని, ఇక్కడ ఒక సమతుల్యత (Balance) అవసరమని కోర్టు స్పష్టం చేసింది.

చివరి వ్యక్తికి అందని ఫలాలు

ఒకే కుటుంబంలో ఉన్నత వర్గాలే అన్ని అవకాశాలను చేజిక్కించుకుంటే, అదే వర్గంలోని అత్యంత వెనుకబడిన పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. రిజర్వేషన్ల ఫలాలు కేవలం కొందరికే పరిమితం కాకుండా, సమాజంలో కిందిస్థాయిలో ఉన్న చివరి వ్యక్తికి కూడా అందాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం ఓబీసీలకే పరిమితమైన 'క్రీమీ లేయర్' నిబంధనలను, మరింత శాస్త్రీయంగా అమలు చేయడంపై న్యాయస్థానం దృష్టి సారించింది.


ఇంద్ర సాహ్ని తీర్పు.. ప్రస్తుత నిబంధనలు

1992 నాటి చారిత్రాత్మక 'ఇంద్ర సాహ్ని' (మండల్ కమిషన్) కేసులో సుప్రీంకోర్టు ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను సమర్థిస్తూనే, వారిలో 'క్రీమీలేయర్' వర్గాలను మినహాయించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం వార్షిక ఆదాయం రూ. 8 లక్షలు దాటిన వారితో పాటు.. ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, ఐఏఎస్, ఐపీఎస్ వంటి సీనియర్ బ్యూరోక్రాట్లు, మిలిటరీలో టాప్ ఆఫీసర్ల పిల్లలను ఆదాయంతో సంబంధం లేకుండా క్రీమీలేయర్ కింద పరిగణించి కోటా నుంచి మినహాయిస్తున్నారు. అయితే, ఈ మినహాయింపులను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

ఇక, ఈ కేసులో సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి, ఇతర సంబంధిత వర్గాలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.


Also Read:

వడదెబ్బ ఎఫెక్ట్.. తెలంగాణ వ్యాప్తంగా 22 మంది మృతి

తండ్రి మరణాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం బాధాకరం? జగన్ తీరుపై మంత్రి గొట్టిపాటి ధ్వజం

Updated Date - May 22 , 2026 | 03:49 PM