Share News

ట్రైన్‌లో నెయ్యిని తీసుకెళ్తున్నారా? ఈ రూల్స్ తెలియకుంటే జరిమానా తప్పదు!

ABN , Publish Date - May 22 , 2026 | 11:21 AM

రైల్లో ప్రయాణించే వారికి లగేజీ నిబంధనలు ఎంతో కీలకమైనవి. రైలు ప్రయాణంలో నెయ్యి, నూనెలను తీసుకెళ్లడంపై రూల్స్ అమల్లో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

ట్రైన్‌లో నెయ్యిని తీసుకెళ్తున్నారా? ఈ రూల్స్ తెలియకుంటే జరిమానా తప్పదు!
Railway Luggage Rules

ఇంటర్నెట్ డెస్క్: రైళ్లలో ప్రయాణించే వారికి లగేజీ నిబంధనలు ఎంతో కీలకమైనవి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఎప్పటికప్పుడు కఠినమైన రూల్స్ అమలు చేస్తూనే ఉంటుంది. అయితే, చాలా మంది ప్రయాణికులు రైలు ప్రయాణాల్లోనెయ్యి, వంట నూనెలు, ఊరగాయలు వంటి పదార్థాలను తీసుకెళ్తుంటారు. అసలు రైల్లో నెయ్యి, నూనె వంటి వాటిని తీసుకెళ్లవచ్చా? వీటికి సంబంధించి రైల్వే నిబంధనలు ఏంటి? అనే సందేహాలు చాలా మందిలో తలెత్తుతుంటాయి. ఈ నియమ నిబంధనలు సరిగ్గా తెలియకుండా ప్రయాణిస్తే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరి రైల్వే శాఖలో ఈ ప్రత్యేక నిబంధనలు ఏంటో తెలుసుకుందాం.


సాధారణంగా రైల్వే చట్టం ప్రకారం.. ప్రయాణికులు తమ వ్యక్తిగత అవసరాల కోసం గరిష్టంగా 20 కిలోల వరకు నెయ్యిని తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. అందుకోసం కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్లాస్టిక్ కవర్లు, లీక్ అయ్యే మూతలు ఉన్న డబ్బాల్లో తీసుకెళ్లడానికి అనుమతించరు. మీరు తీసుకెళ్లే నెయ్యి లేదా ఇతర ద్రవ పదార్థాలు కచ్చితంగా 'లీక్ ప్రూఫ్' ప్యాకేజింగ్‌లో ఉండాలి. ఒకవేళ మీ నిర్లక్ష్యం కారణంగా నెయ్యి లీకై, తోటి ప్రయాణికుల సామగ్రి పాడైతే మీపై కఠిన చర్యలు తీసుకుంటారు. వ్యాపార ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున నెయ్యి టిన్లు, నూనె డబ్బాలను ప్యాసింజర్ కోచ్‌లలో లగేజీగా తరలించడం పూర్తిగా నిషిద్ధం. ఒకవేళ ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లాల్సి వస్తే, దాన్ని ముందే లగేజీ వ్యాన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పేలుడు పదార్థాలు, ఖాళీ గ్యాస్ సిలిండర్లు, యాసిడ్, ప్రమాదకరమైన రసాయనాలు, పొడి ఆకులు, చనిపోయిన కోళ్లు వంటి వస్తువులను కూడా రైళ్లలో తీసుకెళ్లడంపై నిషేధం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి:

నిలకడగా బంగారం, వెండి ధరలు..

వాటర్‌ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్‌

Updated Date - May 22 , 2026 | 12:11 PM