రాష్ట్రంలో ఎబోలా అలర్ట్.. అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం
ABN , Publish Date - May 24 , 2026 | 05:48 PM
ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తూ, రాష్ట్రంలోని విమానాశ్రయాలు, పోర్టుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది.
అమరావతి: ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని స్థాయిల్లో ముందస్తు చర్యలు చేపడుతోంది.
విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల ట్రావెల్ హిస్టరీ ఆధారంగా స్క్రీనింగ్ చేస్తూ, అనుమానాస్పద లక్షణాలు ఉన్నవారిని వెంటనే క్వారంటైన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. విశాఖ పోర్టులో కూడా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది. రోడ్డు మార్గాల ద్వారా రాష్ట్రంలోకి వచ్చే వారిపైనా నిఘా పెంచారు.
ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో వచ్చిన అనుభవాలతో ఎబోలా వైరస్ నియంత్రణకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని తెలిపారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న నగరాల్లో ఐసోలేషన్ వార్డులు, టీచింగ్ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా 15 పడకల వార్డులు ఏర్పాటు చేశామన్నారు. అవసరమైన PPE కిట్లు, వైరస్ పరీక్షా కిట్లు కూడా తగినంతగా అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. అదేవిధంగా ANMలు, ఆశా వర్కర్లకు వర్చువల్ సమావేశాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్న ఆయన.. ఎబోలా లక్షణాలు, జాగ్రత్తలపై ప్రజలకు సమాచారం అందిస్తున్నామని స్పష్టం చేశారు.
ఆఫ్రికా దేశాలకు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత మూడు వారాల్లో ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారు ఆరోగ్య పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య అధికారులను సంప్రదించాలని మంత్రి సత్యకుమార్ కోరారు.
Also Read:
సిగరెట్లు తాగకపోయినా పెదాలు నల్లగా ఉన్నాయా? ఈ చిట్కాలు ట్రై చేయండి
రాగి బాటిల్‌లో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు మాత్రం చేయొద్దు