అప్పుల బారిన పడుతున్నారా? సింకింగ్ ఫండ్‌తో ఆర్థిక టెన్షన్‌కు బ్రేక్!
ABN , Publish Date - Jan 28 , 2026 | 06:42 PM
ప్రతి నెల జీతం వచ్చినా చివరికి డబ్బు మిగలడం లేదా? అకస్మాత్తుగా వచ్చే ఇన్సూరెన్స్ ప్రీమియంలు, స్కూల్ ఫీజులు, రిపేర్ ఖర్చులు అప్పుల బాట పట్టిస్తున్నాయా?
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి నెల జీతం చేతికి రాగానే ఇంటి అద్దె, ఈఎంఐలు, నిత్యావసరాల ఖర్చులు అంటూ మొత్తం సర్దుబాటు చేస్తుంటాం.. అంతా ప్లాన్ ప్రకారమే నడుస్తున్నట్టు అనిపించే సమయంలో అకస్మాత్తుగా కారు ఇన్సూరెన్స్, పిల్లల స్కూల్ ఫీజులు లేదా ఇంటి రిపేర్లు వంటి ఖర్చులు వచ్చి పడతాయి. అప్పుడు చాలామంది క్రెడిట్ కార్డులు వాడడం లేదా అప్పు చేయడం వైపు మొగ్గు చూపుతారు. కానీ వాస్తవానికి ఇవన్నీ మనకు ముందే తెలిసిన ఖర్చులే. ఇలాంటి ఖర్చులకు ముందే సిద్ధమయ్యే మార్గమే సింకింగ్ ఫండ్.
సింకింగ్ ఫండ్ అంటే ఏమిటి?
భవిష్యత్తులో తప్పకుండా ఎదురయ్యే ఖర్చుల కోసం ఇప్పటినుంచే కొద్దికొద్దిగా డబ్బును పక్కన పెట్టే పద్ధతినే సింకింగ్ ఫండ్ అంటారు. పండుగ ఖర్చులు, పిల్లల ఫీజులు, ట్రావెల్ ప్లాన్‌లు లేదా వాహన రిపేర్ల కోసం ముందే ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసుకోవడమే దీని ఉద్దేశం. అప్పు చేసి వడ్డీలు చెల్లించడానికంటే, ముందే డబ్బు దాచుకోవడం ఇందులోని ప్రధాన లాభం.
ఇది కొత్త ఆలోచన కాదు. పెద్ద కార్పొరేట్ సంస్థలు తమ అప్పులు తీర్చేందుకు లాభాల్లో కొంత మొత్తాన్ని ప్రత్యేక నిధిగా నిల్వ చేస్తాయి. గడువు వచ్చినప్పుడు ఒక్కసారిగా ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. ఇదే సూత్రాన్ని వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల్లో అనుసరిస్తే అప్పుల నుంచి బయటపడవచ్చు.
ఎమర్జెన్సీ ఫండ్‌కు, సింకింగ్ ఫండ్‌కు తేడా ఏమిటి?
చాలామంది ఈ రెండింటినీ ఒకటే అనుకుంటారు. కానీ వీటికి స్పష్టమైన తేడాలు ఉన్నాయి. ఎమర్జెన్సీ ఫండ్ అనేది అనుకోని పరిస్థితుల కోసం అమౌంట్ సేవ్ చేయడం.. అంటే ఉద్యోగం కోల్పోవడం లేదా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వంటివి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ ఖర్చు చేస్తారు. సింకింగ్ ఫండ్ అనేది మనకు ముందే తెలిసిన ఖర్చుల కోసం సేవ్ చేయడం.. ఫీజులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, పండగ షాపింగ్ లాంటివి.
ఈ ఫండ్ ఎందుకు అవసరం?
క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే మనం భారీ వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. కానీ సింకింగ్ ఫండ్ ద్వారా డబ్బు దాచుకుంటే వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. పైగా బ్యాంకు వడ్డీ రూపంలో అదనపు ఆదాయం కూడా వస్తుంది. ముఖ్యంగా పెద్ద ఖర్చుల సమయంలో వచ్చే మానసిక ఒత్తిడిని ఇది బాగా తగ్గిస్తుంది. ఈ నిధి లక్ష్యం అధిక లాభాలు కాదు, అవసరమైనప్పుడు డబ్బు అందుబాటులో ఉండటం. అందుకే సురక్షితమైన మార్గాలు ఎంచుకోవాలి.
రికరింగ్ డిపాజిట్ (RD),
లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్,
ఫ్లెక్సీ డిపాజిట్ వంటి ఆప్షన్లు దీనికి అనుకూలం.
చిన్న ప్లాన్‌తో పెద్ద ప్రయోజనం
భవిష్యత్తులో కారు కొనాలనుకుంటే ఇప్పటి నుంచే నెలకు కొంత మొత్తాన్ని సింకింగ్ ఫండ్‌గా దాచుకుంటే అప్పు అవసరం లేకుండా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. కాబట్టి ఈ రోజే మీ ఖర్చులను ప్లాన్ చేసుకుని ఒక సింకింగ్ ఫండ్‌ను ప్రారంభిస్తే, రేపటి ఆర్థిక ఒత్తిడికి చెక్ పెట్టవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
అజిత్ పవార్ విమాన ప్రమాదంపై స్పందించిన కేంద్ర మంత్రి
అమానుష ఘటన.. కన్నబిడ్డనే అమ్ముకున్న కసాయి తండ్రి
For More Latest News