అమానుష ఘటన.. కన్నబిడ్డనే అమ్ముకున్న కసాయి తండ్రి
ABN , Publish Date - Jan 28 , 2026 | 05:50 PM
తూర్పు గోదావరి జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కసాయి తండ్రి కన్నబిడ్డనే రూ.10 లక్షలకు అమ్మేశాడు. వివరాల్లోకి వెళ్తే..
తూర్పు గోదావరి జిల్లా: గోపాలపురం మండలం చిట్యాల గ్రామంలో అమానుష ఘటన వెలుగుచూసింది. వ్యసనాలకు బానిసైన ఓ తండ్రి డబ్బుల కోసం తన ఆరు నెలల పసిబిడ్డను అమ్మేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చిట్యాల గ్రామానికి చెందిన జొన్నకూటి వీరయ్య అనే వ్యక్తి మద్యానికి, ఇతర వ్యసనాలకు అలవాటుపడి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. అప్పుల భారాన్ని తట్టుకోలేక కన్నబిడ్డనే విక్రయించేందుకు సిద్ధమయ్యాడు.
ఈ క్రమంలో దేవరపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి మధ్యవర్తిత్వంతో తన ఆరు నెలల పసిబిడ్డను రూ.10 లక్షలకు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. పసిబిడ్డను విక్రయించిన తండ్రిని, అలాగే శిశువును కొనుగోలు చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కోర్టుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా కొంతమంది ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. మిగిలిన నిందితులను అరెస్టు చేసిన తర్వాతే పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.
Also Read:
అజిత్ పవార్ విమాన ప్రమాదంపై స్పందించిన కేంద్ర మంత్రి
టీటీడీ నెయ్యి కల్తీపై నివేదికపై ఏపీ కేబినెట్‌లో చర్చ