Share News

అజిత్ పవార్ విమాన ప్రమాదంపై స్పందించిన కేంద్ర మంత్రి

ABN , Publish Date - Jan 28 , 2026 | 05:07 PM

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి స్పందిస్తూ, పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతామని ప్రకటించారు.

అజిత్ పవార్ విమాన ప్రమాదంపై స్పందించిన కేంద్ర మంత్రి
Minister Ram Mohan Naidu On Ajit Pawar Plane Crash

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ.. ప్రాథమిక వివరాలను వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో బారామతి విమానాశ్రయంలో విజిబులిటీ తగ్గినట్లు తేలిందని మంత్రి తెలిపారు.


ల్యాండింగ్ సమయంలో రన్‌వే స్పష్టంగా కనిపిస్తుందా లేదా అని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు పైలట్లను ప్రశ్నించారని, రన్‌వే కనిపించడం లేదని వారు సమాధానం ఇచ్చినట్లు వెల్లడించారు. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా విమానం కొంతసేపు గాల్లోనే చక్కర్లు కొట్టినట్లు ఆయన చెప్పారు. అనంతరం రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించే సమయంలో మళ్లీ రన్‌వే కనిపిస్తుందా అని ఏటీసీ ప్రశ్నించగా, పైలట్లు సానుకూలంగా సమాధానం ఇచ్చారని, దాంతో ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వగా, ఆ క్షణాల్లోనే విమానం ప్రమాదానికి గురైందని తెలిపారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో లోతైన విచారణ చేపడతామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత వాస్తవాలను ప్రజల ముందుంచుతామని తెలిపారు.


ఇప్పటికే డీజీసీఏతో పాటు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)కి చెందిన ప్రత్యేక బృందాలు పుణెకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇదే అంశంపై డీజీసీఏ వర్గాలు కూడా స్పందించాయి. ల్యాండింగ్ సమయంలో రన్‌వేను స్పష్టంగా గుర్తించడంలో పైలట్లకు ఇబ్బందులు ఎదురైనట్లు తెలిపాయి. అయితే అత్యవసర పరిస్థితిని సూచించే మేడే కాల్స్ పైలట్ల నుంచి అందలేదని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉందని, దర్యాప్తు పూర్తయ్యాకే ప్రమాదానికి గల అసలు కారణాలు తేలుతాయని అధికారులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి...

నేడు గద్దెపైకి సారలమ్మ.. లక్షలాదిగా తరలివస్తున్న భక్తజనం

బస్సులో వెళ్తున్న విద్యార్థికి ఊహించని ప్రమాదం

Updated Date - Jan 28 , 2026 | 05:11 PM