Share News

శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలా?.. ఇవిగో 8 సూత్రాలు

ABN , Publish Date - Oct 29 , 2026 | 08:56 AM

శీతాకాలం రానే వచ్చింది. కాలాల్లో మార్పుకు అనుగుణంగా తనతో పాటు వ్యాధులను కూడా తీసుకువచ్చింది. శీతాకాలం వచ్చిందంటే చాలు.. ముందుగా గుర్తొచ్చేవి ఎముకలు కొరికే చలి, జలుబు, ఆయాసం, జ్వరం, దగ్గు, తుమ్ములు వంటి సీజనల్ వ్యాధులు. మరి వీటికి పరిష్కారమే లేదా అని బాధపడకండి. వైద్యుల సలహాలతో ఏ సీజనల్ వ్యాధులనైనా అదుపులో ఉంచుకోవచ్చు. అదెలాగో చూద్దాం పదండి.

శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలా?.. ఇవిగో 8 సూత్రాలు
immunity boosting tips

ఇంటర్నెట్ డెస్క్: శీతాకాలంలో రాత్రి వ్యవధి ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఎక్కువ సమయం ఇంట్లో వాళ్లతో గడుపుతారు. ఈ వేళల్లో ఇంట్లో ఒక్కరికి జలుబు, దగ్గు, జ్వరం సోకిందంటే మిగతా కుటుంబసభ్యులు కూడా వీటి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాధికారక వైరస్‌లు ఎలా, ఏ వైపు నుంచి సోకుతాయో తెలియదు. అందుకే వ్యాధినిరోధక శక్తిని కలిగి ఉండడం వల్ల వైరస్‌ల బారిన పడే అవకాశాలను నిరోధించవచ్చు. ‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్’ అని వైద్యులు తెలుపుతున్నారు.


మరి రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా? అని ఆలోచిస్తున్నారా.. ? తొందరపడకండి. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రముఖ రుమటాలజిస్ట్ డాక్టర్ అనురాగ్ భరద్వాజ్ చెప్పిన 8 సూత్రాలేంటో తెలుసుకుందాం.

1. ఆరోగ్యకరమైన, సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి.

సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. సమతుల్యమైన ఆహారం అంటే.. పోషక విలువలు కలిగిన ఆహారం. కూరగాయలు, తృణధాన్యాలు, పండ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు.. వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఆహరంలో అన్నీ రకాల పదార్థాలు తీసుకోవడం ద్వారా గట్ మైక్రోబయోమ్‌ సమర్థవంతంగా పనిచేస్తోంది.


2. విటమిన్, ఖనిజ లోపాలను భర్తీ చేసుకోవాలి

శరీర జీవన వ్యవస్థ పనిచేయడంలో విటమిన్స్, మినరల్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా విటమిన్ ‘డి’ రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు ఉదయం కొంత సమయం ఎండలో గడపడం వల్ల విటమిన్ ‘డి’ పుష్కలంగా దొరుకుతుంది. కానీ మారుతున్న జీవనశైలి కారణంగా శరీరానికి కావాల్సిన విటమిన్‘డి’ ను పొందలేకపోతున్నారు. ఆరుబయటకు వెళ్లలేని వారు, ఏసీ గదుల్లో పనిచేసేవాళ్లు ప్రతిరోజు 400 యూనిట్ల విటమిన్ ‘డి’ ని తీసుకోవాలి. ఇది ఎముకలను గట్టిగా ఉంచడంలో సహకరించడంతో పాటు రోగనిరోధక వ్యవస్థను కాపాడుతుంది. రక్తహీనత, ఆయాసం, అలసట, పాలిపోయిన రంగు, అతినిద్ర లాంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.


3. టీకాలు వేయించుకోవాలి

శీతాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందడానికి టీకాలు వేయించుకోవడం సరైన మార్గం. టీకాలు అంటే చిన్నపిల్లలే వేయించుకుంటారు అనుకోకూడదు. అన్నీ వయసుల వారికి టీకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా గర్భిణీలు, 75 ఏళ్ల వయసు పైబడిన వారు, తరచూ రోగాల బారిన పడేవారు టీకాలు వేయించుకుంటే మంచిది. వయసు రీత్యా ఇన్ఫ్లుయెంజా, కోవిడ్ 19, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్, న్యూమోకాకల్, యాషింగిల్స్ వంటి టీకాలను వైద్యులు సూచిస్తారు.


4. తగినంత నిద్ర అవసరం

రోగనిరోధక వ్యవస్థను కాపాడడంలో నిద్ర అనేది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. నిద్రిస్తున్న సమయంలో శరీరం పునర్నిర్మాణ పనులు చేస్తుంది. అందువల్ల కంటి నిండా నిద్ర పోవడం వల్ల శరీరాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు వీలైనంత సమయం దొరుకుతుంది. రోగనిరోధక వ్యవస్థ నిద్రకు బాగా స్పందిస్తుంది. కానీ.. బిజీ లైఫ్ స్టైల్‌లో ఆందోళన, అలజడి, ఒత్తిడి కారణంగా మనం తగినంత నిద్రపోవడం లేదు. కాబట్టి.. వీలైనంత వరకూ నిద్ర పోవడానికి ప్రయత్నించండి. నిద్రకు ఉపక్రమించే ముందు ఫోన్లు, సిగరెట్లు, కాఫీ, టీ లకు దూరంగా ఉండండి.


5. వ్యాయామం చేయండి

వ్యాయామం చేయడం ద్వారా రోగనిరోధక శక్తి ఉత్తేజపడుతుంది. వాకింగ్ చేయడం, ఏరోబిక్స్ చేయడం, శ్వాస సంబంధ వ్యాయామాలు లాంటి వాటిని రోజువారీ జీవితంలో అలవాటుగా మార్చుకోండి. అలాగని.. అతి వ్యాయామం చేయక్కర్లేదు. అతిగా చేయడం కంటే క్రమం తప్పకుండా చేయడమే ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దానితోపాటు రోగనిరోధక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది.


6. ఒత్తిడిని తగ్గించుకోవాలి

జీవితంలో ఒత్తిడి సహజమే. కానీ దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యంపైన, రోగనిరోధక వ్యవస్థపైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఎప్పటి పనులను అప్పుడే పూర్తి చేసుకోవాలి. వీలైనంత సమయాన్ని ప్రకృతిలో గడపడానికి ప్రయత్నించాలి. తగినంతగా వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబించాలి.


7. ఇళ్లకు సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి

శీతాకాలంలో అధిక చలి నుంచి కాపాడుకోవడానికి మనం గది తలుపులను, కిటికీలను మూసివేస్తూంటాం. బయట గాలి ఇంటి లోనికి రాకుండా చర్యలు తీసుకుంటాం. కానీ.. అలా చేయడం వల్ల గదిలో గాలి ప్రసరణ తగ్గిపోయి.. ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. అందువల్ల ఇంటి లోపలికి గాలి, వెలుతురు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోండి. గాలి ప్రసరణ లేకుండా ఇరుకుగా, రద్దీగా ఉండే ప్రాంతాల కన్నా నాణ్యమైన గాలి దొరికే ప్రాంతాల్లో ఉండడానికి ప్రయత్నించండి.


8. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండండి

ఎముకలు కొరికే చలిని తట్టుకోవడానికి కొంతమంది అదే పనిగా సిగరెట్లు కాల్చుతుంటారు, మద్యాన్ని సేవిస్తారు. కానీ.. అలా చేయడం వల్ల రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. అధికంగా సిగరెట్లను కాల్చడం వల్ల శ్వాస సంబంధ వ్యాధులు సంక్రమిస్తాయి. అధికంగా ధూమపానం, మద్యం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మరింత క్షీణించి వ్యాధుల బారిన పడతారు. సాధ్యమైనంత వరకు మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.


ఇవీ చదవండి

ఆర్నబ్ తుఫాను ప్రభావం.. చెన్నైలో రోడ్లపైకి ఎగసిపడుతున్న అలలు

5 స్టార్ హోటల్‌లో కస్టమర్‌పై జీవితకాల నిషేధం.. ఎందుకో తెలిస్తే..

Updated Date - Oct 29 , 2026 | 09:06 AM