‘హ్యాండ్‌బ్యాగ్’కూ ఓ లెక్కుంది!
ABN , Publish Date - Mar 29 , 2026 | 09:55 AM
అతివలకు, హ్యాండ్‌బ్యాగులకూ అవినాభావ సంబంధం ఉంటుంది. ఆరేళ్ల అమ్మాయి నుంచి అరవై ఏళ్ల అమ్మమ్మ దాకా... హ్యాండ్‌బ్యాగ్ లేకుండా బయటికి అడుగుపెట్టరు.
అతివలకు, హ్యాండ్‌బ్యాగులకూ అవినాభావ సంబంధం ఉంటుంది. ఆరేళ్ల అమ్మాయి నుంచి అరవై ఏళ్ల అమ్మమ్మ దాకా... హ్యాండ్‌బ్యాగ్ లేకుండా బయటికి అడుగుపెట్టరు. అయితే భుజానికి బ్యాగు తగిలించుకుని వెళ్లగానే సరికాదు. చూడటానికి అన్నీ బ్యాగులే అనిపించినా... ఏ బ్యాగు, ఏ సందర్భంలో వాడాలో తెలియాలి. అంటే ‘హ్యాండ్‌బ్యాగ్’కూ ఓ లెక్కున్నట్టేగా...
టీనేజీ యువతుల ప్రియనేస్తం బ్యాక్‌ప్యాక్... ఉద్యోగం చేసే మహిళలు హ్యాండ్‌బ్యాగ్ లేకుండా బయటికి వెళ్లరు. షాపింగ్‌కే కాదు... పార్టీలకు వెళ్లినా, ఫంక్షన్లకు వెళ్లినా... అతివల చేతికి బ్యాగే ఓ అలంకారం. ఒక్కమాటలో చెప్పాలంటే ఆడవాళ్లకి బ్యాగు లేకుండా అస్సలు కుదరదు. అదే అతి ముఖ్యమైన యాక్సెసరీ కూడా. హ్యాండ్‌బ్యాగుల్లో వాళ్లదైన ఓ చిన్న ప్రపంచమే ఉంటుంది. మేకప్, స్కిన్‌కేర్, పర్సనల్ హైజీన్ వస్తువులతో పాటు డబ్బులు, కార్డులు, మందులు, బిస్కెట్లు, నీళ్ల బాటిల్... తదితరాలన్నీ కూడా ఆ బ్యాగులో ఉంటాయి. అంతెందుకు... మగువలు వారి బ్యాగులో క్యారీ చేస్తున్న వస్తువుల ఆధారంగా, వారి అభిరుచులు తెలుసుకోవచ్చు. ఇష్టాలను అర్థం చేసుకోవచ్చు.
మార్కెట్‌లో ఎన్నో రకాల హ్యాండ్‌బ్యాగ్‌లు లభిస్తున్నాయి. అయితే బ్యాగులనూ సందర్భాన్ని బట్టి ఉపయోగించాలన్న విషయం చాలామందికి తెలియదు. ఒక్కో బ్యాగు ఒక్కో తీరులో ఉండడమే కాదు, వాటి వినియోగం కూడా భిన్నమే. అందుకే ఫ్యాషన్ పండితులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బ్యాగుల్ని పలురకాలుగా విభజించారు. వాటిని వాడే సందర్భాలనూ తెలియజేస్తున్నారు.
తోతె బ్యాగ్
సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూ వస్తూ చాలా మంది సూపర్‌మార్కెట్, రైతుబజార్ల దగ్గరో... లేడీస్ కార్నర్‌లోనో ఆగిపోతారు. పనిలో పనిగా అవీ ఇవీ కొనేస్తారు. ఇలా ఆఫీసు కాగితాలతో పాటు చిన్నాచితకా షాపింగ్ వస్తువులనీ సునాయాసంగా మోసేది ‘తోతె బ్యాగ్’. వీటిలో స్థలం ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనికి ‘షాపర్ బ్యాగ్’ అనే పేరూ ఉంది. రోజువారీ అవసరమైన వాటితో పాటు ఆఫీసు సరంజామా, షాపింగ్ వస్తువుల వరకు అన్నింటినీ ఇందులో సులభంగా క్యారీ చేయొచ్చు.
సందర్భం: ఆఫీస్, షాపింగ్, క్యాజువల్ ఔటింగ్స్
క్రాస్‌బాడీ బ్యాగ్
స్టయిల్‌గా కనిపించడంతో పాటు సౌలభ్యంగా కూడా అనిపించేవి ‘క్రాస్‌బాడీ’ బ్యాగ్‌లు. వీటికి పట్టీలు పొడవుగా ఉండడం వల్ల చేతులకు విశ్రాంతి దొరకుతుంది. బ్యాగ్‌ను అలా భుజానికి వేలాడదీసుకుని చేతులతో హాయిగా వేరే పనులను చేసుకోవచ్చు. ఈ బ్యాగులో ఉన్న వస్తువులు కూడా సురక్షితంగా ఉండేలా లోపల కంపార్ట్‌మెంట్స్ అమరిక ఉంటుంది.
సందర్భం: ట్రావెల్, క్యాజువల్ ఔటింగ్స్
శాచల్
దీర్ఘచతురస్రాకారంలో పొడవాటి పట్టీలతో అలరించేవి ‘శాచల్’ బ్యాగులు. వీటి అడుగున ఫ్లాట్‌గా ఉంటుంది. కాబట్టి పుస్తకాలు, నోట్‌బుక్స్, ట్యాబ్, ల్యాప్‌టాప్... తదితరాలను సులువుగా మోసేందుకు సరిపోతుంది. కాలేజీ, వర్క్, బిజినెస్ కార్యకలాపాలకు ఈ బ్యాగ్‌లు బాగా పనికొస్తాయి. స్మాల్ నుంచి మీడియం సైజు వరకూ అనేక మెటీరియల్స్‌తో చేసిన బ్యాగులు అందుబాటులో ఉన్నాయి.
సందర్భం: కాలేజ్, వర్క్, ప్రొఫెషనల్ మీటింగ్స్
క్లచ్‌లు
సాయంత్రం పూట పార్టీలు, చిన్నపాటి సెలబ్రేషన్స్‌లో హైలెట్‌గా నిలవాలంటే చేతిలో ‘క్లచ్’ బ్యాగును పట్టుకోవలసిందే. అందుకే వీటిని ‘ఈవెనింగ్ బ్యాగ్’లనీ పిలుస్తారు. ఈ బ్యాగులకు పట్టీలు చిన్నగా ఉంటాయి. కాబట్టి చేత్తో పట్టుకోవాలి లేక భుజానికి తగిలించుకోవాలి. ఫోను, కార్డులు, లిప్‌స్టిక్, తాళంచెవులు మాత్రమే పట్టేంత చిన్న క్లచ్‌లు లభిస్తున్నాయి. పెళ్లిళ్లల్లో చక్కటి క్లచ్ బ్యాగ్‌ను ఽధరించి సిగ్నేచర్ స్టయిల్‌లో మెరిసిపోవచ్చు.
సందర్భం: పెళ్ళిళ్లు, డిన్నర్ పార్టీలు, సాయంత్రం ఈవెంట్లు
హోబో
లేడీస్ బ్యాగుల్లో ‘హోబో’లకు క్రేజ్ ఎక్కువ. ఇవి రకరకాల డిజైన్లు, సైజుల్లో లభిస్తున్నాయి. ఓవైపు రిలాక్స్‌డ్ లుక్ ఇస్తూనే మరో పక్క ట్రెండీగా అగుపిస్తాయి. వీటికి ఒకటే పట్టీ ఉండడం వల్ల చూడటానికి విభిన్నంగా ఉంటుంది. చేతులతో పట్టుకోకుండా, భుజానికి వేసుకుంటే లుక్ అదిరిపోతుంది. లెదర్, కాన్వాస్, వస్త్రంతో తయారుచేయడం వల్ల హోబో బ్యాగులు మెత్తగా ఉంటాయి. పైకి చిన్నగా కనిపించినా, అన్నింటికీ సరిపడా స్థలం లోపల ఉంటుంది.
సందర్భం: ట్రావెల్, క్యాజువల్ ఔటింగ్
బ్యాక్‌ప్యాక్
విద్యార్థుల ప్రియనేస్తం ‘బ్యాక్‌ప్యాక్’. పుస్తకాలు, నోట్‌బుక్‌లు, టాబ్‌లు మొదలైనవాటిని ఇందులో పెట్టుకుని వీపుకి తగిలించుకుని, ఎలాంటి ఇబ్బంది పడకుండా వెళ్లొచ్చు. ట్రెక్కర్లు, హైకర్లకు వీటి వల్ల ఎంత ఉపయోగమో వేరే చెప్పక్కర్లేదు. రకరకాల బ్యాక్‌ప్యాక్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
సందర్భం: ట్రావెల్, క్యాజువల్ ఔటింగ్స్
బకెట్ బ్యాగ్
పేరుకు తగినట్టు బకెట్‌లా ఉండే బ్యాగ్‌లని అనుకుంటే పొరపాటే. ఈ బ్యాగులు స్తంభాకారంలో ఉంటాయి. అవసరమైన అన్ని వస్తువులను ఇందులో పెట్టుకోవచ్చు. దిగువన మెటల్ ఫ్రేమ్ ఉండడం వల్ల వస్తువులన్నీ కలగాపులగం అవుతాయనే భయం అవసరం లేదు. అలాగే హాయిగా క్యారీ చేయవచ్చు.
సందర్భం: క్యాజువల్, సెమీ ఫార్మల్ అకేషన్స్
ఈవెనింగ్ బ్యాగ్
ఆఫీసు, మార్కెట్‌కూ వేసుకెళ్లే బ్యాగునే సాయంత్రం డిన్నర్లు, పార్టీలకూ వేసుకువెళితే బాగుంటుందా? అలాంటి సందర్భాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినవి ‘ఈవెనింగ్ బ్యాగ్’లు. బీడ్స్, మెరిసే రేకులతో అలంకరణ చేసిన ఈ బ్యాగులు పార్టీలు, ఫంక్షన్లలో గ్లామర్‌ను అద్దుతాయి. సందర్భానికి తగిన ప్రత్యేక అలంకరణతో మెరిసిపోతారు.
సందర్భం: డిన్నర్స్, ఫార్మల్ ఈవెంట్స్
శాడిల్
క్యాజువల్ వేర్‌లోనూ, ట్రెండీ లుక్‌ను తీసుకొచ్చేది ‘శాడిల్’ బ్యాగ్. అతివల ఆహార్యా న్ని ఒక్కసారిగా స్టయిలిష్‌గా మారుస్తుంది. అప్పట్లో గుర్రంస్వారీ సమయంలో ఇలాంటి బ్యాగులు వాడేవారు. అందుకే ఆ పేరు. అయితే ఆ బ్యాగులే నేడు కాస్త లుక్ మారి ఫ్యాషనబుల్‌గా మారాయి. శాడిల్ బ్యాగులు మోటార్ బైక్, విమాన ప్రయాణాలకు బాగా సరిపోతాయి. స్పేస్ ఎక్కువగా ఉండడం వల్ల అవసరమైనవన్నీ బ్యాగులో పెట్టుకోవచ్చు. సులభంగా క్యారీ చేయవచ్చు.
సందర్భం: క్యాజువల్ వేర్, వీకెండ్ ఔటింగ్స్
ఆయా సందర్భాలకు తగ్గట్టుగా దుస్తులు, నగలు ధరించినట్టే... బ్యాగుల విషయంలో కూడా కాస్త అవగాహన ఉంటే, ఇంకాస్త స్టయిలిష్‌గా ఉంటుందని అంటున్నారు ఫ్యాషన్ పండితులు. అందుకే మార్కెట్లో కనిపించే హ్యాండ్‌బ్యాగులన్నీ ఒకటే అనే భావనను విడనాడి... అవసరం, సౌకర్యాన్ని బట్టి అతివలు హ్యాండ్‌బ్యాగులను ఎంచుకోవాలి. అప్పుడే సౌకర్యం, స్టయిల్ మీ చేతికి వస్తుంది. మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతుంది.
ముచ్చటగా 3 చిట్కాలు
బ్యాగులను కొనడం ఈజీనే, కానీ వాటిని పదికాలాల పాటు పదిలంగా చూసుకోవాలంటే కాస్త శ్రమపడాల్సిందే. కొన్న తొలి రోజుల్లో ఉన్న మెరుపులు కొనసాగాలంటే ఈ మూడు జాగ్రత్తలు పాటించి చూడండి.
సూర్యరశ్మి: ఎండ నేరుగా పడకుండా డస్ట్ బ్యాగు లేదా పిల్లో కవర్‌లో బ్యాగుని భద్రపరచాలి.
ఆకారం: ఎక్కువ కాలం చెక్కుచెదరకుండా ఉండాలంటే బ్యాగు ఆకారం బాగుండాలి. అందుకే బ్యాగు లోపల పాత కాటన్ టీ షర్టులు, టిష్యూ పేపర్లు ఉంచాలి. ఎప్పుడూ పట్టీలపై వేలాడదీయకూడదు. దీని వల్ల బ్యాగు సాగుతుంది. చీలికలు వచ్చి, దెబ్బతింటుంది.
శుభ్రపరచడం: కండిషనర్ లేదా సబ్బు నీటిలో అద్దిన మెత్తటి గుడ్డని బ్యాగు మీద అద్దుతూ శుభ్ర పరచాలి. లెదర్ కండిషనర్ ప్రత్యేకంగా లభిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎస్ఐఆర్ వర్సెస్ అల్లర్లు.. బెంగాల్‌లో వేడెక్కిన ఎన్నికల ప్రచారం
Read Latest Telangana News and National News