చలికాలంలో ఆకలి ఎందుకు పెరుగుతుంది.. అసలు కారణాలు ఇవే..
ABN , Publish Date - Nov 22 , 2026 | 04:31 PM
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలామందికి ఆకలి ఎక్కువగా వేస్తుంటుంది. భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఏదైనా తినాలనిపిస్తుంది. అందుకే చాలా మంది చలికాలంలో బరువు పెరుగుతుంటారు.
ఇంటర్నెట్ డెస్క్: చలికాలం వచ్చిందంటే చాలు.. చాలామందికి ఆకలి ఎక్కువగా వేస్తుంటుంది. భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఏదైనా తినాలనిపిస్తుంది. అందుకే చాలా మంది చలికాలంలో బరువు పెరుగుతుంటారు. అసలు చలికాలంలో ఆకలి ఎక్కువగా వేయడానికి కారణమేంటి? మన శరీరంలో సాధారణంగా 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. బయట ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు శరీరం వేడిని కోల్పోకుండా, అదనపు వేడిని ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియను థర్మోజెనెసిస్ అంటారు (Winter Hunger).
ఈ థర్మోజెనెసిస్ ప్రక్రియ ముఖ్యంగా రెండు విధాలుగా జరుగుతుంది. కండరాలు వేగంగా సంకోచించడం ద్వారా వణుకు రావడం, బ్రౌన్ ఫ్యాట్ ద్వారా వేడిని ఉత్పత్తి చేయడం. ఈ ప్రక్రియలకు శక్తి అవసరం. అందువల్ల చలికి ఎక్కువసేపు గురయ్యే వ్యక్తుల్లో శక్తి వినియోగం పెరగవచ్చు. దాంతో ఎక్కువ క్యాలరీలు అవసరమవుతాయి. దాంతో ఆకలి పెరుగుతుంది. అయితే ఈ ప్రక్రియ అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. మనిషి శరీర తత్వాన్ని బట్టి మారుతుంటుంది (Winter Weight Gain).

అలాగే చలికాలంలో నిద్ర, శారీరక శ్రమ, ఆహారపు అలవాట్లు మారడం వల్ల హార్మోన్ల నియంత్రణపై ప్రభావం పడుతుంది. మన ఆకలిని గ్రెలిన్, లెప్టిన్ అనే హార్మోన్లు నియంత్రిస్తాయి. చలికాలంలో పగటి సమయం తగ్గుతుంది. సూర్యరశ్మి అందే సమయం కూడా తగ్గుతుంది. దీనివల్ల శరీరంలోని జీవ గడియారం (సర్కాడియన్ రిథమ్) ప్రభావితమవుతుంది. ఈ కారణంగా ఆకలి హార్మోన్లతో పాటు నిద్రను నియంత్రించే మెలటోనిన్ విడుదల సమయాల్లో కూడా మార్పులు వస్తాయి. దీంతో కొందరిలో మానసిక స్థితి, ఆహారపు కోరికలు కూడా మారతాయి. కొంతమందికి చలికాలంలో కార్బోహైడ్రేట్లు, తీపి పదార్థాలు ఎక్కువగా తినాలనిపించడానికి ఇది ఒక కారణం కావచ్చు (Seasonal Food Cravings).
చలికి గురైనప్పుడు శరీరం వేడిని ఉత్పత్తి చేయడానికి అదనపు శక్తిని ఉపయోగిస్తుంది (Winter Metabolism). ఈ పరిస్థితుల్లో ఆహారం ద్వారా శక్తిని తిరిగి పొందాలనే జీవసంబంధమైన అవసరం ఏర్పడుతుంది. దీంతో ఎక్కువ క్యాలరీలు ఉండే వేడి వేడి పదార్థాలు, నూనెలో వేయించే ఆహారాలు తినాలనే కోరిక పెరుగుతుంది. చలికాలం కొందరిలో మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. దీనిని 'వింటర్ డిప్రెషన్' అని కూడా అంటారు. ఆ ఒత్తిడిలో చాలా మంది ఎక్కువ ఆహారం తీసుకుంటారు. ఫలితంగా బరువు పెరుగుతారు.
ఇవి కూడా చదవండి..
భారత్, చైనా కమాండర్ల భేటీ.. అరుణాచల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చ..
రూ.13 లక్షల బ్రెజ్జాకు బదులుగా రూ.9.5 లక్షల కారు ఇచ్చారని.. పెళ్లినే రద్దు చేసుకున్న ఢిల్లీ పోలీస్..