లిచీ పండ్లు ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా?
ABN , Publish Date - May 27 , 2026 | 02:25 PM
లిచీ పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, వాటిని అధికంగా తింటే కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే లిచీని ఎంత మోతాదులో, ఎప్పుడు తినాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఇంటర్నెట్ డెస్క్: వేసవిలో లిచీ పండ్లు తినడం చాలా మందికి ఎంతో ఇష్టం. ఇవి తియ్యగా, రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని భావిస్తారు. లిచీలో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, లిచీ పండ్లను ఎక్కువగా లేదా ఖాళీ కడుపుతో తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎక్కువగా లిచీ తింటే ఏమవుతుంది?
ఆరోగ్య నిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం, లిచీని అధికంగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం పడుతుంది. దీంతో నీరసం, తలనొప్పి, తల తిరగడం, అలసట వంటి సమస్యలు రావచ్చు. కొంతమందిలో కడుపు నొప్పి, గ్యాస్, విరేచనాలు లేదా అలెర్జీ సమస్యలు కూడా కనిపించవచ్చు.
లిచీ పండ్లను మితంగా తినడం మంచిది. రోజుకు 8 నుంచి 10 లిచీ పండ్లు సరిపోతాయి. తినే ముందు వాటిని బాగా కడగాలి. ఖాళీ కడుపుతో తినడం మంచిది కాదు. పిల్లలకు కూడా పరిమితంగా మాత్రమే ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రిజ్‌లో పెట్టిన లిచీ పండ్లను వెంటనే తినకుండా, కొద్దిసేపు బయట పెట్టి సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత తినడం మంచిదని చెబుతున్నారు.
జాగ్రత్త
లిచీ పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, అందరికీ ఇవి సురక్షితం కాదు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు, రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండేవారు, అలర్జీలు ఉన్నవారు లిచీ పండ్లను తినకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా ఎక్కువగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
పనస గింజలతో కాఫీని తయారు చేయవచ్చా?
రుచికరమైన బోటీ కర్రీ.. ఇంట్లోనే హోటల్ స్టైల్ టేస్ట్