Share News

జాకెట్టు... కనికట్టు...

ABN , Publish Date - Oct 25 , 2026 | 09:50 AM

చీరకు మ్యాచ్‌ అయ్యే బ్లౌజ్‌ చూస్తే చాలనుకునేవారు ఇంతకు ముందు. కాలం మారింది... ఇప్పుడు మ్యాచింగ్‌ జాకెట్‌కు అర్థం మారింది.

జాకెట్టు... కనికట్టు...
lifestyle

చీరకు మ్యాచ్‌ అయ్యే బ్లౌజ్‌ చూస్తే చాలనుకునేవారు ఇంతకు ముందు. కాలం మారింది... ఇప్పుడు మ్యాచింగ్‌ జాకెట్‌కు అర్థం మారింది. అతివల దృష్టిలో బ్లౌజ్‌ అనేది ఓ ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌... ఓ ఎక్స్‌ప్రెషన్‌... ఓ ఆటిట్యూడ్‌. అందుకే సోషల్‌ మీడియాలో చీరలకన్నా డిజైనర్‌ బ్లౌజ్‌ల రీల్స్‌ ఎక్కువయ్యాయి. పండగలు, వేడుకల సీజన్లో ట్రెండీగా నిలిచిన బ్లౌజ్‌లు, వాటి డిజైన్లపై ఓ లుక్కేద్దాం...

పందిట్లో పెళ్లవుతోంది. వధూవరుల మీద అక్షింతల జల్లు కురుస్తోంది. చూడచక్కనైన ఆ జంటను నూరేళ్లూ చల్లగా ఉండాలని ఆహుతులందరూ ఆశీర్వదిస్తున్నారు. పెళ్లికి వచ్చిన మగువల దృష్టి మాత్రం వధువు ధరించిన డిజైనర్‌ బ్లౌజ్‌ మీదకి వెళ్లింది. ‘ఎక్కడ కుట్టించుకుందో... అలాంటి డిజైన్‌ ఏ సినిమాలోనూ చూడలేదు, అద్భుత ఎంబ్రాయిడరీ, చూడచక్కని ఫాబ్రిక్‌ రంగు...’ ఇలా రకరకాల ఊసులు ఆ పెళ్లికూతురి రవికె చుట్టూతనే. గత కొంతకాలంగా చీర కన్నా రవికే స్పాట్‌లైట్‌లో నిలుస్తోంది. దీనికి సినిమాల్లో హీరోయిన్లు ధరిస్తున్నవి, సోషల్‌ మీడియా రీల్స్‌, డిజైనర్ల సృజనాత్మకత... ఇలా అనేక కారణాలున్నాయి. ప్రతీ ఒక్కరూ తమకే ప్రత్యేకమైన బ్లౌజ్‌లు కుట్టించుకుంటున్నారు. ఇదే క్రమంగా ‘స్టేట్‌మెంట్‌ బ్లౌజ్‌ కల్చర్‌’గా రూపుదిద్దుకుంది.

వీ నెక్‌, యూ నెక్‌, కాలర్‌ నెక్‌, ఫ్రంట్‌ ఓపెన్‌, బ్యాక్‌ ఓపెన్‌లతో పాటు నేడు కార్సెట్‌, డ్యూయల్‌ నెక్‌లైన్స్‌, పఫ్‌ స్లీవ్స్‌ లాంటి పదాలు బ్లౌజ్‌ల డిజైనింగ్‌లో కొత్తగా వచ్చి చేరాయి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న కొన్ని బ్లౌజ్‌ డిజైన్లు ఏమిటో చూద్దాం.


book3.jpgతీరైన ఆకృతి కోసం...

2026లో బాగా ట్రెండింగ్‌లో నిలచిన బ్లౌజ్‌ డిజైన్‌ కార్సెట్‌. యూరప్‌లో మధ్యయుగాల్లో రాణీవాస స్త్రీలు తీరైన నడుము ఆకృతి కోసం... వస్త్రంతో నడుము భాగాన్ని గట్టిగా అదిమి పెట్టేవారు. దీన్నే కార్సెట్‌గా పిలుస్తారు. ఇన్నేళ్ల తరవాత మళ్లీ ఇప్పుడు అలాంటి కార్సెట్‌ బ్లౌజ్‌లు వచ్చాయి. శరీర సౌష్టవాన్ని తీర్చిదిద్దుతూ, తీరైన నడుము, ఎస్‌ ఆకృతిని ఈ బ్లౌజ్‌లు అందిస్తున్నాయి. అందుకే పెళ్లికూతుర్ల ఇష్టమైన బ్లౌజ్‌లుగా మారాయి.

ఇలా ప్రయత్నించండి: ప్లెయిన్‌ పట్టు, ఆర్గాంజా, టిష్యూ చీరల మీదకి కార్సెట్‌ బ్లౌజ్‌లు బాగా నప్పుతాయి.


book3.2.jpgఇన్‌స్టా ఫ్రెండ్లీ...

ఇన్‌స్టా నిండా ప్రస్తుతం డ్యూయల్‌ నెక్‌లైన్స్‌ బ్లౌజ్‌లే కనువిందు చేస్తున్నాయి. అందుకే వీటికి ఇన్‌స్టా ఫ్రెండ్లీ డిజైన్‌గా పేరొచ్చింది. పేరుకు తగినట్టే మెడ ముందు భాగం ఒకలా, వైనక భాగం మరోలా ఉండడమే ఈ బ్లౌజ్‌ ప్రత్యేకత. అంటే రెండు విభిన్నమైన డిజైన్ల బ్లౌజ్‌లు ఒకే రవికగా కుట్టడం వల్ల ఈ డిజైన్‌ వచ్చిందన్న మాట. పూసలు, ఎంబ్రాయిడరీ, లేసుల లాంటి వాటితో మరింత రమణీయంగా వీటిని డిజైన్‌ చేస్తున్నారు.

ఇలా ప్రయత్నించండి: ఈ తరహా రవికెలు ప్రతీ ఫ్రేమ్‌లో, యాంగిల్‌లో అద్భుతంగా కనిపిస్తాయి. ఆధునిక డిజైనర్‌ వేర్‌, ఆర్గాంజా, టిష్యూ చీరలపైకి ఇలాంటి బ్లౌజ్‌లు సరిపోతాయి.


వీ మళ్లీ కొత్తగా...

ఫ్యాషన్‌ రంగంలో ప్రతీ ఐదేళ్లకూ పాతవి కొత్తగా మళ్లీ రావడం మామూలే. వీ నెక్‌ బ్లౌజ్‌లు కూడా అలా ఈ ఏడాది కొత్తగా మార్కెట్‌ను ముంచెత్తాయి. భుజాలను తీర్చిదిద్దినట్టుగా చూపడంలో వీ నెక్‌ తరవాతే మిగతావి ఏవైనా. పైగా ఇవి స్టయిలిష్‌గా కనిపిస్తాయి.

ఇలా ప్రయత్నించండి: షిఫాన్‌, జార్జెట్‌, పట్టు చీరల మీదకి ఈ బ్లౌజ్‌లు బాగా సెట్‌ అవుతాయి.

హృదయాకారంలో...

ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ‘స్వీట్‌హార్ట్‌ నెక్‌’ ఉన్న బ్లౌజ్‌లు ధరించిన మగువలని చూడగానే ఇటు శక్తివంతంగా, అటు రొమాంటిక్‌గా... అంతే మోడ్రన్‌గా కూడా అనిపిస్తారు. భుజాలు ఓపెన్‌గా హృదయానికి హత్తుకుని అదే ఆకారంలో ఉండే ఈ బ్లౌజ్‌లు ధరించిన మగువల లుక్‌ అద్దిరిపోతుంది.

ఇలా ప్రయత్నించండి: పేస్టల్‌, టిష్యూ చీరలు, ఎంబ్రాయిడరీ వర్క్‌ ఉన్న చీరల మీదకి ఇలాంటి బ్లౌజ్‌లు బాగుంటాయి.


book3.5.jpgపఫ్‌ చేతులతో...

డిజైనర్‌ వార్డ్‌రోబ్‌లు, బ్రైడల్‌ షూట్‌లలో పఫ్‌ చేతులున్న బ్లౌజుల హవా నడుస్తోంది. ఇలాంటి చేతుల రవికెలు ఎప్పటి నుంచో ఉన్నా... సిల్క్‌, టిష్యూ, ఆర్గాంజా మెటీరియల్‌తో చేసినవి కొత్తగా మెరిసిపోతున్నాయి. అందరిలోకీ ప్రత్యేకంగా కనిపించాలనుకునే మగువలు రకరకాల పఫ్‌ చేతులతో ప్రయోగాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు.

ఇలా ప్రయత్నించండి: ప్లెయిన్‌ సిల్క్‌, టిష్యూ, ఆర్గాంజా చీరల మీదకి ఇవి సెట్‌ అవుతాయి.

నెక్‌లైన్‌ మెరుపు...

ప్రస్తుతం ‘హాల్టర్‌ ఛోళీ’లు ఆధునిక మహిళల నేస్తాలుగా మారాయి. స్లీవ్‌లెస్‌గా ఉంటూ మెడను రకరకాల డిజైన్ల పట్టీలతో కట్టి భుజాలను, అప్పర్‌ బ్యాక్‌ భాగాన్ని ఖాళీగా ఉంచడం ఈ నెక్‌లైన్‌ల స్పెషాలిటీ. రా సిల్క్‌, వెల్వెట్‌, శాటిన్‌, స్ట్రెచబుల్‌ లిక్రా దుస్తులకు ఎంబ్రాయిడరీ, మిర్రర్‌, మోతిఫ్‌ వర్క్‌లతో మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు.

ఇలా ప్రయత్నించండి: టిష్యూ, ఆర్గాంజా, శాటిన్‌ చీరలకు ఈ తరహా బ్లౌజ్‌లు బాగా సెట్‌ అవుతాయి.


హై ఫ్యాషన్‌

వెనక భాగాన్ని ఖాళీగా ఉంచడం లేదా లేసులు, నెట్‌ డిజైన్‌లతో పూర్తిగా పారదర్శకంగా ఉంచుతూ హై ఫ్యాషన్‌కి చిరునామాగా మారాయి ‘షీర్‌ బ్యాక్‌’ బ్లౌజ్‌లు. వెనుక భాగాన్ని ఆరి, త్రెడ్‌, రాళ్లతో అలంకరిస్తూ ఈ బ్లౌజ్‌ల లుక్‌ మరింత ముచ్చటగా తీర్చిదిద్దుతున్నారు డిజైనర్లు.

ఇలా ప్రయత్నించండి: పట్టు, టిష్యూ, షిఫాన్‌ చీరల మీదకి ఇలాంటి బ్లౌజ్‌లు బాగుంటాయి.

జరీ... ఎంబ్రాయిడరీలతో...

కొన్నాళ్లుగా బ్లౌజ్‌ ముందు భాగం కన్నా... కూడా బ్యాక్‌ నెక్‌ మీద సృజనాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారు డిజైనర్లు. జరీ మన సంస్కృతీ సంప్రదాయాలకు చిహ్నం. అందుకే ఎత్నిక్‌ బ్రైడల్‌ వేర్‌లో జరీ అంచులున్న బ్యాక్‌నెక్‌లు... పింట్రెస్ట్‌, ఇన్‌స్టా రీల్స్‌లో కనువిందు చేస్తున్నాయి. అయితే వీటికి ఆధునికతను జోడించి జెన్‌జీ అమ్మాయిలకు నప్పేలా రూపొందించడం విశేషం. సవ్యసాచి బ్రైడల్‌ లుక్స్‌లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తాయి.

ఇలా ప్రయత్నించండి: కాంచీవరం, బెనారస్‌, టిష్యూ పట్టు చీరల మీదకి ఈ బ్లౌజ్‌లు బాగుంటాయి.


రెట్రో లుక్‌...

ఈ ఏడాది ఫ్రంట్‌ ఓపెన్‌ బ్లౌజ్‌లు పెద్ద కమ్‌బ్యాక్‌ ఇచ్చాయి. పెద్ద బటన్‌లు, కాంట్రాస్ట్‌ పైపింగ్‌, నడుము వరకూ వచ్చే పొడవాటి ఫ్రంట్‌ ఓపెన్‌ బ్లౌజ్‌లు మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. వీటిని సులభంగా ధరించవచ్చు. ఇంకా ఆధునికంగా, స్టయిల్‌గా ఉండడంతో పాటు సౌకర్యవంతంగా అనిపిస్తాయి. అందుకే ఈ బ్లౌజ్‌ల్లో ప్రయోగాలు మరీ ఎక్కువయ్యాయి. ఈ రెట్రో లుక్‌ను హీరోయిన్లు కూడా ఇష్టపడుతున్నారు.

ఇలా ప్రయత్నించండి: కాటన్‌, ప్రింటెడ్‌, కాజువల్‌ చీరల మీదకి ఈ షర్టు లాంటి బ్లౌజ్‌లు బాగుంటాయి.

పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో మార్కెట్లోకి రకరకాల డిజైనర్‌ బ్లౌజ్‌లు వెల్లువెత్తుతున్నాయి. అందుకే చీరలతో పాటు సరికొత్త బ్లౌజ్‌ డిజైన్ల కోసం చాలామంది సోషల్‌ మీడియాను జల్లెడ పడుతున్నారు. వాటిల్లో ఇష్టమైన డిజైన్‌ను ఎంచుకుని, ప్రత్యేకంగా మెరిసిపోవడం మీ

చేతుల్లోనే ఉంది.


ఈ రంగులదే హవా...

ప్రస్తుతం ఏ డిజైన్‌ బ్లౌజ్‌లనే కాదు... ఏ రంగులు ట్రెండీగా ఉన్నాయో తెలుసుకునేందుకు సోషల్‌మీడియాలో తెగ వెతికేస్తోంది నేటి తరం. వాళ్లు ముచ్చటపడుతున్న రంగులివి...

  • ఐవరీ, షాంపెయిన్‌: ఈ ఏడాది పెళ్లికూతుళ్ల బ్లౌజ్‌ కలర్‌గా పేరు తెచ్చుకుంది.

  • డీప్‌ వైన్‌, మెరూన్‌: సంప్రదాయమైన రంగు అయినా ప్రస్తుతం పట్టు చీరలపైకి మ్యాచింగ్‌ రంగుగా ఇది రాజ్యమేలుతోంది.

  • మెటాలిక్‌ గోల్డ్‌, సిల్వర్‌ : కాక్‌టైల్‌, రిసెప్షన్‌ బ్లౌజ్‌లు ఈ రంగులో ఉంటున్నాయి.

  • పౌడర్‌ పింక్‌, బ్లష్‌: సంగీత్‌లకి ఈ రంగు బ్లౌజ్‌లు ఎక్కువగా ధరిస్తున్నారు. ఆధునిక పెళ్లికూతుళ్లకి ఇది ఫేవరెట్‌ రంగు.

  • ఎమరాల్డ్‌ గ్రీన్‌, బాటిల్‌ గ్రీన్‌: ఎలిగెంట్‌ లుక్‌ అందించడంతో పాటు సిగ్నేచర్‌ బ్లౌజ్‌లుగా ఈ రంగులు పేరుతెచ్చుకున్నాయి.

  • మిడ్‌నైట్‌ బ్లూ, బ్లాక్‌: ఈవెనింగ్‌ ఈవెంట్స్‌కి బాగా సెట్‌ అయ్యేవి ఇవే.

  • రస్ట్‌ అండ్‌ కాపర్‌ టోన్స్‌: పెళ్లికూతుళ్ల డిజైనర్‌ బ్లౌజుల్లో ఈ రంగులని ఇప్పుడు బాగా వినియోగిస్తున్నారు.

Updated Date - Oct 25 , 2026 | 09:50 AM