స్విట్జర్లాండ్‌లో ట్రంప్ విందు.. ఏడుగురు భారతీయ సీఈవోలకు ఆహ్వానం..
ABN , Publish Date - Jan 20 , 2026 | 09:17 PM
స్విట్జర్లాండ్‌లో జరుగుతోన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(WEF) సదస్సుకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా దావోస్‌లో ట్రంప్ విందు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఆ విందుకు ఏడుగురు భారతీయ సీఈవోలకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది..
ఇంటర్నెట్ డెస్క్: స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు ప్రపంచ నలుమూలల నుంచి దేశాధినేతలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు హాజరవుతున్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) ఆరేళ్ల విరామం తర్వాత దావోస్‌కు రానున్నారు. ట్రంప్ డబ్ల్యూఈఎఫ్‌లో పాల్గొనడం ఇది మూడోసారి..
ఈ సందర్భంగా ట్రంప్ ప్రత్యేక విందును (Trump dinner) ఏర్పాటు చేయనున్నారు. ఈ విందుకు ఏడుగురు భారతీయ సీఈవోలు ఆహ్వానం అందుకున్నారని సమాచారం. భారత్‌కు చెందిన ముఖ్య వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ఇచ్చే విందులో పాల్గొనే వారిలో టాటా గ్రూప్ (Tata Group) ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, భారతి ఎంటర్‌ప్రైజెస్ అధినేత సునీల్ మిత్తల్, విప్రో సీఈవో శ్రీని పల్లియా, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ ఎస్. పరేఖ్, బజాజ్ ఫిన్‌సెర్వ్ సీఎండీ సంజీవ్ బజాజ్, మహీంద్రా గ్రూప్ సీఈవో అనీష్ షా, జూబిలెంట్ భర్తియా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు హరి ఎస్. భర్తియా ఉన్నారని సమాచారం.
ఈ ఏడాది వరల్డ్ ఎకనామిక్ ఫోరం (World Economic Forum -2026) సదస్సుకు 130కి పైగా దేశాల నుంచి సుమారు 3,000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య సుంకాల విధానాలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ ప్రసంగంపై అందరిలో ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి..
రీల్స్ కోసం ప్రాణాలనైనా లెక్క చేయం.. ఈ యువకుడి బైక్ స్టంట్ చూస్తే..
మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న పావురాన్ని 15 సెకెన్లలో కనిపెట్టండి..