హౌతీలపై దాడికి అమెరికా రెడీ.. చివరి నిమిషంలో ట్రంప్ యూటర్న్..
ABN , Publish Date - Sep 21 , 2026 | 01:54 PM
యెమెన్‌కు చెందిన హౌతీల దాడులతో సౌదీ అరేబియా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతోంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సహాయం కోరారు.
ఇంటర్నెట్ డెస్క్: యెమెన్‌కు చెందిన హౌతీల దాడులతో సౌదీ అరేబియా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతోంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సహాయం కోరారు. హౌతీలపై సైనిక చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందుకు ట్రంప్ కూడా అంగీకరించారు. బాంబులు కూడా లోడ్ చేసి సిద్ధంగా ఉన్న సమయంలో ట్రంప్ మనసు మార్చుకున్నట్టు సమాచారం (Trump Houthis).
హౌతీ బలగాలు యెమెన్‌లోని ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో, ముఖ్యంగా బాబ్ అల్-మందబ్ జలసంధి సమీపంలో ఆధిపత్యం సాధించడంతో సౌదీకి, అంతర్జాతీయ నౌకాయానానికి సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌తో ఎంబీఎస్ ఫోన్‌లో మాట్లాడి, హౌతీలపై ప్రత్యక్ష సైనిక చర్య తీసుకోవాలని కోరినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. అంతకుముందు కూడా ఎంబీఎస్ ట్రంప్‌తో ఈ అంశంపై మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ట్రంప్ హౌతీలపై దాడులకు సిద్ధమయ్యారు (US Houthi strikes).
ట్రంప్ ఆదేశాల తర్వాత అమెరికా సైనిక కమాండర్లు హౌతీ స్థావరాలకు సంబంధించిన లక్ష్యాలను ఖరారు చేశారు. దాడులకు ఎంపిక చేసిన అమెరికా యుద్ధ విమానాలకు బాంబులను కూడా లోడ్ చేశారు. దాడులకు దాదాపు సిద్ధంగా ఉన్న సమయంలో ట్రంప్ మరోసారి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దాడులు వద్దని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం హౌతీలపై వైమానిక దాడులు ఉండవని అమెరికా అధికారులు తెలిపారు (MBS Trump call).
ట్రంప్ నిర్ణయం వెనుక పలు అంశాలు ఉన్నట్లు సమాచారం (US Saudi relations). అమెరికా ఇప్పటికే ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో నిమగ్నమై ఉంది. ఈ సమయంలో యెమెన్‌లో హౌతీలపై మరో సైనిక చర్య వల్ల అమెరికా బలగాలపై అదనపు భారం పడే అవకాశం ఉంది. అలాగే సౌదీ అరేబియా తరఫున హౌతీలపై నేరుగా యుద్ధంలోకి దిగడాన్ని అమెరికా అధ్యక్షుడి సన్నిహితులు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. దీంతో హౌతీలపై సైనిక చర్యలకు ట్రంప్ ప్రస్తుతానికి వెనకడుగు వేసినట్టు సమాచారం. అయితే ఈ నిర్ణయం శాశ్వతమా లేదా తాత్కాలికమా అన్నది స్పష్టంగా లేదు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ యుద్ధం.. నా ముందు మూడు మార్గాలు: అమెరికా అధ్యక్షుడు
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..