పశ్చిమాసియాకు వేలాదిగా బలగాలు... యూఎస్ సన్నాహాలు
ABN , Publish Date - Mar 19 , 2026 | 10:09 AM
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మూడో వారానికి చేరుకోవడంతో ఈ పోరును తదుపరి దిశకు తీసుకు వెళ్లేందుకు డొనాల్ట్ ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతోంది. వేలాదిగా అమెరికా బలగాలను పశ్చిమాసియాకు తరలించేందుకు యూఎస్ మిలటరీ సన్నాహకాలు చేస్తోందని ఉన్నతాధికార వర్గాల సమాచారం.
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మూడో వారానికి చేరుకోవడంతో ఈ పోరును తదుపరి దిశకు తీసుకు వెళ్లేందుకు డొనాల్ట్ ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతోంది. వేలాదిగా అమెరికా బలగాలను పశ్చిమాసియాకు తరలించేందుకు యూఎస్ మిలటరీ సన్నాహకాలు చేస్తోందని ఉన్నతాధికార వర్గాల తాజా సమాచారం.
వైమానిక, నావికా దళాలతో హోర్ముజ్ జలసంధి మీదుగా చమురు ట్యాంకుల రవాణాకు రక్షణ కల్పించాలని యూఎస్ ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం అమెరికా బలగాలను ఇరాన్ తీరప్రాంతం వెంబడి మోహరించాల్సి ఉంటుంది. 90 శాతం ఇరాన్ చమురు ఎగుమతులకు కేంద్రస్థానంగా ఉన్న ఖర్గ్ ఐలాండ్‌కు బలగాలను పంపే అవకాశాలపై కూడా ట్రంప్ యంత్రాంగ చర్చలు సాగిస్తోందని చెబుతున్నారు. అయితే ఈ ఆపరేషన్ ప్రమాదంతో కూడినదని, ఇరాన్ బలగాలు క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడే అవకాశం ఉందని యుఎస్ అధికారి ఒకరు తన అభిప్రాయం వ్యక్తం చేసారు. కాగా, ఇరాన్‌కు సైనిక బలగాలు పంపే విషయంలో ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అయితే అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ట్రంప్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపారు.
ఇరాన్‌లో అత్యంత కీలక చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ఐలాండ్‌పై మార్చి 13న అమెరికా బలగాలు వైమానిక దాడులు జరిపాయి. ప్రధానంగా మిలటరీ స్థావరాలను లక్ష్యంగా ఈ దాడులు జరపామని, 90 శాతం సైనిక లక్ష్యాలు, క్షిపణి నిల్వ కేంద్రాలు, నౌకాదళ స్థావరాలు ధ్వంసమయ్యాయని యూఎస్ ప్రకటించింది. అయితే చమురు మౌలిక సదుపాయలపై మాత్రం దాడులు జరపలేదు. ఐలాండ్‌ను ధ్వంసం చేయడానికి బదులు తమ అధీనంలోకి తీసుకోవడమే సరైన ఆప్షన్ అవుతుందని మిలటరీ నిపుణులు చెబుతున్నారు. పరిమిత స్థాయిలో యుఎస్ గ్రౌండ్ ట్రూప్స్‌ను ఉపయోగించినప్పటికీ అది ట్రంప్‌కు రాజకీయంగా రిస్క్ కావచ్చని, ప్రజల నుంచి మద్దతు కూడా చాలా తక్కువగా ఉంటే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
హబ్షాన్ గ్యాస్ ఫెసిలిటీ, బాబ్ ఆయిల్ ఫీల్డ్ కార్యకలాపాలు నిలిపివేత