Share News

'మా ఓపికకు కూడా హద్దులుంటాయి': సౌదీ అరేబియా

ABN , Publish Date - Mar 19 , 2026 | 08:04 AM

ఇరాన్ దాడులపై సౌదీ అరేబియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మా ఓపికకు కూడా హద్దులుంటాయని గ్రహించాలని పేర్కొంది. దేశ రక్షణ కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ఇరాన్‌‌ను హెచ్చరించింది.

'మా ఓపికకు కూడా హద్దులుంటాయి': సౌదీ అరేబియా
Saudi Arabia warns Iran

రియాద్, ఫిబ్రవరి 19: పొరుగుదేశాలపై ఇరాన్ సాగిస్తున్న వరుస దాడులు, ఉద్రిక్తతలను పెంచే చర్యలపై సౌదీ అరేబియా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. తోటి గల్ఫ్ దేశాల మీద ఇరాన్ చేస్తున్న దాడుల్ని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ తీవ్రంగా ఖండించారు. మా ఓపికకు కూడా హద్దులుంటాయని గ్రహించాలని, దేశ రక్షణ కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ఇరాన్‌‌ను హెచ్చరించారు. ప్రాంతీయ స్థిరత్వాన్ని పరిరక్షించడంపై సౌదీ దృష్టి సారించిందని నొక్కిచెప్పారు.

ఇరాన్ చేస్తున్న దాడులను తాము గమనిస్తున్నామని, అయితే సౌదీ అరేబియా ఓపిక అపరిమితం కాదని విదేశాంగ మంత్రి హెచ్చరించారు. ప్రాంతీయ స్థిరత్వం కోసం తాము ఇప్పటివరకు సంయమనం పాటించామని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ తన క్షిపణి, డ్రోన్ దాడుల ద్వారా పొరుగు దేశాల సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తోందని, ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని అన్నారు. ఒకవేళ ఇరాన్ తన వైఖరిని మార్చుకోకపోతే, తమ దేశ ప్రయోజనాలను, ప్రజల రక్షణను కాపాడుకోవడానికి అవసరమైన ఏ చర్యకైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు.


ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని, ఇరాన్ అనాలోచిత చర్యలను అడ్డుకోవడానికి తగిన ఒత్తిడి తీసుకురావాలని సౌదీ కోరింది. ఖతార్, యూఏఈ (అబుదాబి) లోని చమురు, గ్యాస్ ప్లాంట్లపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియా చేసిన ఈ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ వైఖరి భవిష్యత్తు పరిణామాలను శాసించే అవకాశం కనిపిస్తోంది.


ఇవి కూడా చదవండి..

రజినీని బాధపెట్టాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు.. టీవీకే నేత క్షమాపణలు..

భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురి సజీవ దహనం!

Updated Date - Mar 19 , 2026 | 08:06 AM