Share News

అమెరికా వీసా ఇంటర్వ్యూలకు బ్రేక్.. ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..

ABN , Publish Date - Aug 26 , 2026 | 09:41 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వలస విధానాలను మరింత కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా రీషెడ్యూల్ చేయడం ప్రారంభించింది.

అమెరికా వీసా ఇంటర్వ్యూలకు బ్రేక్.. ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..
US visa interviews paused

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వలస విధానాలను మరింత కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా రీషెడ్యూల్ చేయడం ప్రారంభించింది. ఇప్పటికే ఇంటర్వ్యూ తేదీలు పొందిన కొందరు దరఖాస్తుదారులకు కూడా వారి అపాయింట్‌మెంట్లు మారుస్తున్నట్లు సమాచారం అందింది (US visa interviews paused).


అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో పనిచేస్తున్న కాన్సులర్ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వీసా దరఖాస్తుదారులను మరింత సమగ్రంగా, ఒకే విధమైన ప్రమాణాలతో పరిశీలించేందుకు ఈ శిక్షణ ఇస్తున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. ముఖ్యంగా అమెరికాలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలపై ఆధారపడే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించడంపై కొత్త శిక్షణలో దృష్టి పెట్టనున్నారు (Trump visa policy).


ఇప్పటికే వీసా ఇంటర్వ్యూలకు అపాయింట్‌మెంట్ తీసుకున్న కొంతమంది దరఖాస్తుదారులకు వారి ఇంటర్వ్యూలు రద్దు లేదా రీషెడ్యూల్ అవుతున్నట్లు ఈమెయిల్స్ అందుతున్నాయి. అయితే కొత్త ఇంటర్వ్యూ తేదీని వెంటనే ప్రకటించడం లేదు. భవిష్యత్తులో కొత్త తేదీ, సమయం గురించి సమాచారం అందిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగా ఇప్పటికే ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్న దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు (US visa appointments).


అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం ట్రంప్ ప్రభుత్వం చేపడుతున్న విస్తృత ఇమ్మిగ్రేషన్ క్రాక్‌డౌన్‌లో భాగంగా కనిపిస్తోంది (Trump immigration crackdown). వీసాలు, గ్రీన్ కార్డులపై మరింత కఠినమైన పరిశీలన, సోషల్ మీడియా కార్యకలాపాల పరిశీలన, కొన్ని వీసాల రద్దు వంటి చర్యలను ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది. అమెరికా జాతీయ భద్రతను, దేశ ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యమని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది.


ఇవి కూడా చదవండి..

ఇరాన్‌తో మా సంబంధాల్లో మీ జోక్యం వద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్..


కొద్దిగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Aug 26 , 2026 | 09:41 AM