ఇరాన్ యుద్ధంలో గడువు ముగిసిన ఆయుధాలు.. అమెరికా నేవీ అధికారి సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Nov 18 , 2026 | 11:44 AM
ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా నౌకాదళం గడువు ముగిసిన ఆయుధాలను కూడా ఉపయోగించిందా? తాజాగా ఆ దేశ నౌకాదళ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా నౌకాదళం గడువు ముగిసిన ఆయుధాలను కూడా ఉపయోగించిందా? తాజాగా ఆ దేశ నౌకాదళ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఆయుధాల గడువు ముగిసినప్పటికీ వాటిని తిరిగి వినియోగించుకునేలా సాంకేతికంగా మార్పులు చేసి యుద్ధంలో ప్రయోగించినట్లు అమెరికా నేవీ తాత్కాలిక కార్యదర్శి హంగ్ కావో వెల్లడించారు (US Navy Expired Weapons).
ఇరాన్‌పై చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ సందర్భంగా కొన్ని ఆయుధాల గడువు ముగిసిపోయిందని, అయితే వాటి కండిషన్ కోడ్‌లను మార్చి తిరిగి వినియోగించినట్లు చెప్పారు. ఈ ఆయుధాలకు కోడ్ ఎకో, కోడ్ ఫాక్స్‌ట్రాట్ కేటాయించామని, అవి గడువు ముగిసిన ఆయుధాలను సూచిస్తాయని వివరించారు. తిరిగి వినియోగించుకునేలా వాటి కోడ్‌లను మార్చి ప్రయోగించామని తెలిపారు. బ్రెడ్ పాతబడిపోయినంత మాత్రాన దాన్ని పూర్తిగా పారేయాల్సిన అవసరం లేదని, కొద్దిగా నీళ్లు చల్లి మైక్రోవేవ్‌లో 15 సెకన్ల పాటు వేడి చేస్తే మళ్లీ తినడానికి అనువుగా మారుతుందని పేర్కొన్నారు (US Military Weapons Shortage).
ఇరాన్‌తో యుద్ధం కారణంగా అమెరికా ఆయుధ నిల్వలపై ఒత్తిడి పెరుగుతున్నట్లు కావో వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది (Pentagon Weapons Stockpile). ముఖ్యంగా ఖరీదైన క్షిపణులు, వైమానిక రక్షణ వ్యవస్థల్లో ఉపయోగించే ఆయుధాల నిల్వలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే అమెరికా ఆయుధాల ఉత్పత్తి సామర్థ్యంపై కూడా కావో మాట్లాడారు. గతంలో ఏడాదికి సుమారు 125 టోమాహాక్ క్షిపణులు మాత్రమే ఉత్పత్తి చేసేవారని, ప్రస్తుతం నెలకు 60కి పైగా తయారవుతున్నాయని తెలిపారు. ఇతర క్షిపణి నిరోధక ఆయుధాల ఉత్పత్తిని కూడా పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
కశ్మీర్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..