యూరోప్‌కు ట్రంప్ అల్టిమేటమ్
ABN , Publish Date - Apr 09 , 2026 | 08:25 PM
హోర్ముజ్ జలసంధి భద్రతపై స్పష్టమైన ప్రణాళికలు సమర్పించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐరోపా దేశాలకు స్పష్టం చేశారు. ప్రకటనలతో సరిపెడితే కుదరదని తేల్చి చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: గల్ఫ్‌లో కాల్పుల విరమణ వేళ అమెరికా ప్రభుత్వం దీర్ఘకాలిక చర్యల వైపు అడుగులు వేస్తోంది. హోర్ముజ్ మీదుగా రాకపోకలకు భద్రత కల్పించేందుకు ఐరోపా దేశాలు కూడా రంగంలోకి దిగాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తేల్చిచెప్పారు. ప్రకటనలతో సరిపెట్టకుండా స్పష్టమైన ప్రణాళికలను సమర్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని నాటో ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు. స్పష్టమైన ప్లాన్స్ కావాలని ఐరోపా దేశాలను అమెరికా కోరినట్టు వెల్లడించారు.
తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో కూడా ట్రంప్ ఐరోపా దేశాలపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐరోపాపై ఒత్తిడి తెస్తే తప్ప వారు సమస్య తీవ్రతను అర్థం చేసుకోలేకపోవడం విచారకరమని కామెంట్ చేశారు. అంతకుముందు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టెతో కూడా ట్రంప్ సమావేశం అయ్యారు. ఈ వివరాలను ఐరోపా దేశాలతో మార్క్ పంచుకున్నారు. హోర్ముజ్‌పై ట్రంప్ స్పష్టమైన హామీలు కోరుతున్నారని ఐరోపా దేశాలకు స్పష్టం చేశారు. వారి ప్రణాళికలను వీలైనంత త్వరగా సమర్పించాలని కోరారు.
హోర్ముజ్‌ను తెరిపించేందుకు సహకరిస్తామని యూకే సారథ్యంలోని 40కి పైగా దేశాలు ఇదివరకే హామీ ఇచ్చాయి. ఈ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రస్తుతం యూఏఈ పర్యటనలో ఉన్నారు. మరోవైపు, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉందన్న భయాలు పెరుగుతున్నాయి. ఒప్పందానికి తూట్లు పడి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారొచ్చన్న ఆందోళన నెలకొంది.
ఈ వార్తలూ చదవండి:
హోర్ముజ్‌లో టోల్ విధింపునకు మేము వ్యతిరేకం.. ఐరోపా సమాఖ్య
యూఎస్‌తో చర్చలు.. ఇరాన్ అణు ఇంధన సంస్థ చీఫ్ కీలక వ్యాఖ్య