హోర్ముజ్‌లో టోల్ విధింపునకు మేము వ్యతిరేకం.. ఐరోపా సమాఖ్య
ABN , Publish Date - Apr 09 , 2026 | 07:28 PM
హోర్ముజ్ జలసంధి మీదుగా రవాణాకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని ఐరోపా సమాఖ్య గురువారం స్పష్టం చేసింది. రవాణాకు స్వేచ్ఛ ప్రజావసరమని పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధి మీదుగా రవాణాకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని ఐరోపా సమాఖ్య గురువారం స్పష్టం చేసింది. హోర్ముజ్ మీదుగా నౌకలను అనుమతించేందుకు ఫీజులు వసూలు చేసే అవకాశం ఉందన్న ఇరాన్ వ్యాఖ్యలపై ఈ మేరకు ఈయూ స్పందించింది. ‘అంతర్జాతీయ చట్టాల ప్రకారం, రవాణాకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. ఎలాంటి చెల్లింపుల, టోల్ ఫీజుల వసూలు ఉండకూడదు’ అని యూరోపియన్ కమిషన్ ప్రతినిధి తెలిపారు. రవాణాకు స్వేచ్ఛ ప్రజావసరమని అన్నారు. ఈ స్వేచ్ఛకు ఎలాంటి అవరోధం ఉండకూడదని స్పష్టం చేశారు.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ స్పందించారు. ఇరాన్‌తో పాటు దాని మిత్రదేశాలన్నీ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగమేనని అన్నారు. ఇందులో ఎలాంటి మినహాయింపు లేదని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు కాల్పుల విరమణ ఉల్లంఘనే అని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ స్పష్టం చేశారు. మోసానికి, కట్టుబాటు లేకపోవడానికి సంకేతమని స్పష్టం చేశారు. ఈ దాడులు ఇలాగే కొనసాగితే చర్చలు నిరర్థకంగా మారతాయని అన్నారు. తమ వేళ్లు ట్రిగ్గర్ మీదే ఉన్నాయని మరోసారి హెచ్చరించారు. లేబనీస్ సోదరసోదరీమణులను ఇరాన్ ఎన్నటికీ ఒంటరిగా వదిలిపెట్టదని అన్నారు.
ఇక గురువారం తమపై ఎలాంటి దాడులు జరగలేదని సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, ఒమాన్ దేశాలు పేర్కొన్నాయి. ఫిబ్రవరి 28 తరువాత గల్ఫ్ దేశాలు ఇలాంటి ప్రకటన చేయడం ఇదే తొలిసారి. యుద్ధ విరమణ దిశగా ఇరాన్ బుధవారం తన 10 పాయింట్ల ప్లాన్‌ను అమెరికా ముందు పెట్టిన విషయం తెలిసిందే. ఇరాన్ యూరేనియం శుద్ధి కార్యక్రమాలపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని స్పష్టం చేసింది.
ఈ వార్తలూ చదవండి:
యూఎస్‌తో చర్చలు.. ఇరాన్ అణు ఇంధన సంస్థ చీఫ్ కీలక వ్యాఖ్య
హెజ్‌బొల్లా నేత హతం.. ఇజ్రాయెల్ ప్రకటన