యూఎస్‌తో చర్చలు.. ఇరాన్ అణు ఇంధన సంస్థ చీఫ్ కీలక వ్యాఖ్య
ABN , Publish Date - Apr 09 , 2026 | 06:22 PM
యూఎస్‌తో చర్చల్లో భాగంగా తమ హక్కులకు రక్షణ అవసరమని ఇరాన్ అణు ఇంధన సంస్థ చీఫ్ మొహమ్మద్ ఎస్లామీ అభిప్రాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: యూఎస్‌తో చర్చలకు సంబంధించి ఇరాన్ అణు ఇంధన సంస్థ అధిపతి మొహమ్మద్ ఎస్లామీ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. యూరేనియం శుద్ధి తమ హక్కు అని ఆయన అన్నారు. యూఎస్‌తో కాల్పుల విరమణ చర్చల్లో భాగంగా ఈ హక్కుకు రక్షణ అవసరమని చెప్పారు. ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ స్మృత్యర్థం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో గురువారం ఎస్లామీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ఈ కామెంట్స్ చేశారు. కానీ ఈ హక్కు గురించి ఎవరూ మాట్లాడట్లేదని కూడా అన్నారు. ఇరాన్‌తో చర్చల్లో ఈ అంశాన్ని చేర్చేందుకు యూఎస్ విముఖత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వారాంతంలో యూఎస్, ఇరాన్‌లు ఇస్లామాబాద్ వేదికగా కాల్పుల విరమణపై చర్చించనున్న నేపథ్యంలో ఎస్లామీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఇదిలా ఉంటే, కాల్పుల విరమణ ఒప్పందాన్ని లెబనాన్‌కూ విస్తరించాల్సిన అవసరం ఉందని యూకే విదేశాంగ శాఖ మంత్రి ఇవెట్ కూపర్ అభిప్రాపడ్డారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రం అవడం ఆందోళనకరమని అన్నారు. ఇప్పటికే అక్కడ మానవసంక్షోభం తలెత్తిందని, ప్రజల వలసలు పెరిగాయని అన్నారు. ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ యూఏఈ పర్యటనలో ఉన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం మరింత కాలం పాటు కొనసాగేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ వార్తలూ చదవండి:
హెజ్‌బొల్లా నేత హతం.. ఇజ్రాయెల్ ప్రకటన
హోర్ముజ్‌లోకి నో ఎంట్రీ.. వెనక్కు మళ్లుతున్న నౌకలు