Share News

ఇరాన్‌తో చర్చలకు అవకాశం.. ట్రంప్ సంకేతాలు

ABN , Publish Date - Mar 10 , 2026 | 09:29 PM

మధ్యప్రాచ్యంలో యుద్ధ తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో తాను చర్చలు జరిగే అవకాశం ఉండొచ్చని అన్నారు. అయితే పరిస్థితులను బట్టి అది ఉంటుందన్నారు.

ఇరాన్‌తో చర్చలకు అవకాశం.. ట్రంప్ సంకేతాలు
Donald Trump

వాషింగ్టన్: మధ్యప్రాచ్యంలో యుద్ధ తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో తాను చర్చలు జరిగే అవకాశం ఉండొచ్చని అన్నారు. అయితే పరిస్థితులను బట్టి అది ఉంటుందన్నారు. చర్చలు జరిపేందుకు టెహ్రాన్ ఆసక్తిగా ఉన్నట్టు తనకు తెలిసిందని, అయితే నిర్దిష్ట నిబంధనల ఆధారంగానే చర్చలు ఉంటాయని ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ఇరాన్‌ కొత్త సుప్రీం నేతగా మొజ్తాబా ఖమేనీ ఎంపికపై తన అసంతృప్తి మరోసారి వ్యక్తం చేశారు. వాషింగ్టన్‌తో ఆయన సామరస్యంగా ఉంటారని తాను అనుకోవడం లేదన్నారు.


ఇరాన్‌పై అమెరికా దాడులను ట్రంప్ సమర్ధించుకున్నారు. ఫిబ్రవరి 28న జరిపిన దాడిలో ఇరాన్‌ వద్దనున్న సగం క్షిపణి నిల్వలను ధ్వంసం చేశామని చెప్పారు. మరో మూడో రోజులు ఆగి ఉంటే తమపైనే దాడులు జరిగి ఉండేవని అన్నారు. ఇరాన్ వద్ద 11 అణుబాంబుల తయారీకి సరిపడే ఎన్రిచ్డ్ యురేనియం నిల్వలు ఉన్నట్టు తమ రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ సమాచారం ఇచ్చారని, దీంతో సైనిక చర్య అనివార్యమైందని ట్రంప్ వివరించారు.


దాడులు మరింత ముమ్మరం.. డిఫెన్స్ సెక్రటరీ హెచ్చరిక

కాగా, ఇరాన్ లక్ష్యాలపై తమ ఆపరేషన్‌ను మరింత ఉధృతం చేయనున్నట్టు అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సేత్ హెచ్చరించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సైతం కఠిన వైఖరే ప్రదర్శించారు. ఇరాన్‌లో అధికారాన్ని విచ్ఛిన్నం చేసి, నిరంకుశ ప్రభుత్వాన్ని వదిలించుకునేందుకు ప్రజలకు అవకాశం ఇవ్వడమే తమ లక్ష్యమని ప్రకటించారు.


ఇవి కూడా చదవండి..

సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం... ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు కమల్ ఖరాజీ

నౌకల స్వాధీనం కంటే ముంచేయడమే సరదాగా ఉంటుంది.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Mar 10 , 2026 | 09:58 PM