Share News

ఎన్విడియా సీఈఓ వ్యవహారంపై ఎఫ్‌బీఐ దర్యాప్తు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - Nov 10 , 2026 | 07:28 AM

అమెరికాలో సంచలనం సృష్టిస్తున్న ఎన్విడియా సంస్థ సీఈఓ జెన్సన్ హువాంగ్ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనకు ఒక చైనా వ్యాపారవేత్తతో ఉన్న సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్విడియా సీఈఓ వ్యవహారంపై ఎఫ్‌బీఐ దర్యాప్తు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
Donald Trump, Nvidia CEO

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో సంచలనం సృష్టిస్తున్న ఎన్విడియా సంస్థ సీఈఓ జెన్సన్ హువాంగ్ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనకు ఒక చైనా వ్యాపారవేత్తతో ఉన్న సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే జెన్సన్ హువాంగ్‌కు ఆ మహిళకు సంబంధించిన ఆరోపణల గురించి ముందుగా తెలియకపోయి ఉండవచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డారు (Donald Trump about Jensen Huang).


వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యవహారంపై స్పందించారు. తాను జెన్సన్ హువాంగ్‌తో మాట్లాడినట్లు తెలిపారు. ఆ మహిళ చైనా గూఢచారిగా వ్యవహరిస్తున్నట్లు తనకు ఎలాంటి సమాచారం లేదని హువాంగ్ చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ విషయంలో ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తున్నట్లు తనకు తెలుసని, హువాంగ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ఆయనను గౌరవనీయమైన వ్యక్తిగా అభివర్ణించారు. ఆలిస్ హువాంగ్ అనే మహిళతో జెన్సన్ హువాంగ్‌కు సంబంధం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆమె సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ ఇంటర్నేషనల్ అనే డేటా సెంటర్ సంస్థలో గతంలో కీలక బాధ్యతలు నిర్వహించారు (Nvidia CEO FBI Investigation).


జెన్సన్ హువాంగ్ అమెరికా టెక్నాలజీ రంగం సమాచారాన్ని చైనా ప్రభుత్వానికి చేరవేసినట్టు అమెరికా నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాగా, ఈ వ్యవహారంపై జెన్సన్ హువాంగ్ కూడా స్పందించారు. తన భార్య, పిల్లలకు క్షమాపణలు చెబుతూ, సంస్థ ఉద్యోగులకు బహిరంగ లేఖ రాశారు. ఒక వ్యాపారవేత్తతో సన్నిహిత సంబంధం ఉన్న విషయాన్ని అంగీకరించారు. అయితే ఆ మహిళ పేరును తన లేఖలో వెల్లడించలేదు. ఈ వివాదం నేపథ్యంలో ఎన్విడియా సంస్థ బోర్డు కూడా స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. తమ సీఈఓ విదేశీ నిఘా కార్యకలాపాలకు లక్ష్యంగా మారారా? అనే అంశాన్ని పరిశీలిస్తోంది (Chinese Spy Allegations).


అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారం ఏదైనా బయటకు వెళ్లిందా? సంస్థకు చెందిన కీలక సాంకేతిక వివరాలు ఇతర దేశాలకు చేరాయా? అనే ప్రశ్నలు కూడా ఈ వ్యవహారంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని జెన్సన్ వెల్లడించారు. అమెరికా జాతీయ భద్రతను, ఎన్విడియా సంస్థ ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. మరోవైపు, ఈ గూఢచర్య ఆరోపణలను చైనా ప్రభుత్వం ఖండించింది. తమ దేశంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ పేర్కొన్నారు. చైనాను అపఖ్యాతిపాలు చేసేందుకు ఈ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.


ఈ వార్తలనూ చదవండి:

పల్లెపోరుకు వేళాయె!

ఆ ఒక్కచోట ఎందుకిలా?

Updated Date - Nov 10 , 2026 | 07:28 AM